
సాక్షి, మచిలీపట్నం: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్టీఆర్, బసవ తారకమ్మ కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలా? అని ప్రశ్నించారు. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేది అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైఎస్సార్‌సీపీ బాధ్యత అని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైందా?. అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ పెట్టాలి. తప్పతాగి, కళ్లు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొడిగితే బాలకృష్ణ ఉండబట్టలేకపోయాడు. సైకో బుద్దులు, సైకో ఆలోచనలు బాలకృష్ణవే. అఖండ సినిమాకు సాయం చేయమని సీఎం హోదాలో వైఎస్ జగన్ చెప్పారు.
సొంత అన్నలా చిరంజీవిని వైఎస్ జగన్ చూసుకున్నారు. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేది. చిరంజీవి తక్షణం స్పందించడాన్ని వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తుంది. మీ కాళ్ల దగ్గరకు సినిమా వాళ్లు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాం నాటి జీవోనే కూటమి పాలకులు కొనసాగిస్తున్నారు. సినిమా పేదోడికి దగ్గరగా ఉండాలని ఆరోజు మీటింగ్‌లో వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్సార్ సాయం చేయకపోతే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేది. చంద్రబాబు హయంలో క్యాన్సర్ ఆసుపత్రి బిల్లులు ఆగిపోయాయని బాలయ్య చెప్పారు.
గొంతుక వినిపించడం వైఎస్సార్‌సీపీ బాధ్యత..
వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైఎస్సార్‌సీపీ బాధ్యత. కైకలూరు సమస్యల గురించి ఏనాడూ కామినేని శ్రీనివాస్ మాట్లాడరు. సినిమాలు, సినిమా రేట్లు, సినిమా మనుషుల గురించి కామినేని మాట్లాడతారు. కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. విచక్షణ, ఇంగితజ్ఞానం లేకుండా కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. మంత్రి పదవి కోసం కామినేని పచ్చి పాపపు మాటలు మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మామిడి రైతులకు నష్ట పరిహారం కింద నాలుగు పైసలు ఇచ్చారా?.

ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు..
మెరిట్ లిస్టు ప్రకటించకుండా నియామక పత్రాలు ఎలా ఇస్తారు?. వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకూ 1998 డీఎస్సీకి దిక్కుందా?. డీఎస్సీ ప్రశ్నాపత్నంలో అన్నీ తప్పులే.. విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అంటే హంగూ, ఆర్భాటం, హడావుడి ఉంటుంది. అలాగే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఏమైంది?. కూటమి పాలకులు హెలికాప్టర్లు, విమానాల్లో ఉంటారు.. ప్రజలు ఎవరిని అడగాలి అని ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎస్సీ ప్రశాపత్నంలో అన్నీ తప్పులే.. విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు.