దాడి జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం ఎస్సై ప్రశాంతి (ఇన్‌సెట్‌లో) హతుడు బాబీ (ఫైల్)
ఇంటి ఎదురుగా అర్ధరాత్రి సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడని ఆగ్రహం
వెళ్లిపోవాలని.. లేనిపక్షంలో నరికేస్తానని హెచ్చరిక
అన్నట్లుగానే కొద్దిసేపటికి వచ్చి దాడి
కాకినాడ జిల్లా యర్రంపాలెంలో దారుణం
మద్యం మత్తు.. బంధాలు చిత్తు
గండేపల్లి: పూటుగా తాగిన మద్యం మత్తు తలకెక్కి, విచక్షణ కోల్పోయి, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఓ కిరాతకుడు బాలుడిని కత్తితో నరికి చంపేశాడు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యర్రంపాలేనికి చెందిన బుంగా బాబ్జీ అలియాస్ బాబీ (17), అతడి స్నేహితుడు ఇజ్జిన చందు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో కొమ్ము సత్తిబాబుకు చెందిన ఇంటి పునాదిపై కూర్చుని సెల్‌ఫోన్‌లో ఆడుతున్నారు.
దీనికి ఎదురుగా నివాసం ఉంటున్న కాకర చిన్ని (సుమారు 50 ఏళ్లు) వీళ్ల వద్దకు వచ్చాడు. అర్ధరాత్రి ఏం పని మీకు, వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పటికే అతడు పూటుగా తాగి ఉన్నాడు. ఈ క్రమంలో బాబీ, చిన్ని మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన చిన్ని.. అక్కడే ఉంటే నరికేస్తానంటూ బాబీని బెదిరించి ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే తిరిగి కత్తి పట్టుకుని వచ్చి, బాబీ మెడపై ఒక్కసారిగా నరికాడు. తీవ్రంగా గాయపడిన బాబీ అక్కడి నుంచి ఇంటికెళ్తూ రోడ్డుపై కుప్పకూలిపోయాడు.
స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నిని బంధువులు శనివారం పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ‘రాత్రి అన్నం తిని అందరం పడుకున్నాం. ఎప్పుడు బయటకెళ్లాడో తెలీదు. నా కొడుకుని తీసుకురండి’ అంటూ హతుడు బాబీ తల్లి విజయకుమారి బోరున విలపిస్తోంది. ఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ఇన్‌చార్జి సీఐ బి. సూర్య అప్పారావు, గండేపల్లి ఎస్సై యూవీ శివనాగబాబు, సిబ్బంది పరిశీలించారు.


