పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎన్నికల తేదీలు సమీపిస్తుండటంతో నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే నేపధ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తమ పార్టీ ‘మై-బహిన్ మాన్ యోజన’ను ప్రారంభిస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి రోజున ఓటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 2026 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ఈ పథకాన్ని అమలు చేస్తామని, దీని కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ. 30 వేలు అందిస్తామన్నారు.
తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ అమలు చేయబోయే కీలక సంక్షేమ పథకాలను తేజస్వి యాదవ్ వివరించారు. రాష్ట్ర ఉద్యోగుల పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, పోలీసు సిబ్బందితో సహా అన్నిశాఖల ప్రభుత్వ సిబ్బందిని వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియమించేలా చూస్తామన్నారు. వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే క్వింటాలుకు అదనంగా రూ. 300, గోధుమలకు క్వింటాలుకు రూ. 400 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్‌లో మార్పును ముందుకు నడిపించడంలో మహిళల మద్దతు కీలకమని పేర్కొన్నారు.
ఇటీవల ‘మహాఘట్ బంధన్’ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని వివరాల ప్రకారం వారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిసెంబర్ ఒకటి నుండి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఐదేళ్ల పాటు మహిళలకు రూ.30 వేల వార్షిక చెల్లింపును కూడా మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. మకర సంక్రాంతి నాడు ఈ మొత్తాన్ని మహిళల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని తేజస్వి పేర్కొన్నారు. బీహార్‌లోని ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం  అందిస్తామని తేజస్వి యాదవ్ గతంలో హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడ్దాక 20 నెలల్లోపు బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం అంటూ ఉండదని తేజస్వి గతంలో పేర్కొన్నారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించాక ముందుగా  క్యాబినెట్ సమావేశంలోనే ఈ ప్రతిపాదనపై సంతకం చేస్తానని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘ఇస్కాన్’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
