న్యూఢిల్లీ: శ్రీకృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ఇప్పుడు బంగ్లాదేశ్‌లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ దేశంలోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులన్నీ ‘ఇస్కాన్’పై ఉగ్రవాద ముద్ర వేశాయి. అలాగే ఈ సంస్థపై సంపూర్ణ నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. గత కొంతకాలంగా ఇస్కాన్ దేవాలయంతో సహా బంగ్లాదేశ్‌లోని పలు హిందూ దేవాలయాలను ఇస్లాంవాదులు తగులబెట్టారు. 
హిందూ వ్యతిరేక నినాదాల హోరు
ఇస్కాన్ ను వెంటనే నిషేధించాలని కోరుతూ పలువురు మతఛాందసవాదులు బంగ్లాదేశ్ వీధుల్లో నిరసనలు వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత రాజధాని ఢాకా, చట్టోగ్రామ్‌లో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలలో హిందూ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. ఇస్కాన్ ను తక్షణం బ్యాన్ చేయాలంటూ నినదించారు. ఈ నేపధ్యంలోనే చట్టోగ్రామ్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ సమావేశాలు జరిగాయి. హెఫాజత్-ఎ-ఇస్లాం, ఇంతిఫాదా బంగ్లాదేశ్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఇస్కాన్‌ను నిషేధించాలని పిలుపునిచ్చిన ఇస్లామిస్ట్ గ్రూప్ హెఫాజత్ ఎ ఇస్లాం సంస్థ గతంలో ముస్లిం మహిళలకు సమాన హక్కుల కోసం చేసిన సిఫార్సులను తీవ్రంగా ఖండించింది. 
యూనస్ ప్రభుత్వం రాకతో..
ఇటీవల ఢాకాలోని బైతుల్ ముకర్రం మసీదు సమీపంలో జరిగిన సమావేశంలో ఇంతిఫాదా బంగ్లాదేశ్ సంస్థ పలు డిమాండ్లను ప్రస్తావించింది. ఇస్కాన్‌ను నిషేధించడమనేది వాటిలో ప్రధానమైనది. ఢాకాకు చెందిన బంగ్లా దినపత్రిక దేశ్ రూపాంతర్ తెలిపిన వివరాల ప్రకారం అల్-ఖైదా అనుబంధ అన్సరుల్లా బంగ్లా టీం (ఏబీటీ) చీఫ్ జాసిముద్దీన్ రెహమానీ ఇటీవల ఇస్కాన్‌ను ఒక తీవ్రవాద సంస్థగా అభివర్ణించారు. కాగా 2024, ఆగస్టులో యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రెహ్మాన్ ను జైలు నుంచి విడుదల చేశారు. పలు నేరాలకు పాల్పడిన అవామీ లీగ్‌ను నిషేధించిన విధంగానే, తీవ్రవాద సంస్థగా ఇస్కాన్‌ను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ చట్టోగ్రామ్ ర్యాలీలో ఒక ఇస్లాం వక్త ప్రసంగించినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ పేర్కొంది.
1970 నుండి నిస్వార్థ సేవలు
2024, ఆగస్టులో హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌పై  నిరసనలు పెరిగాయి. పలు ఇస్కాన్ దేవాలయాలు , కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. ప్రముఖ హిందూనేత కృష్ణ దాస్ ప్రభును అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. 1970 నుండి బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నిస్వార్థ సేవలు అందిస్తోంది. 1971లో విముక్తి యుద్ధం, వరదల కాలంలో లక్షలాది మందికి ఉచితంగా ఆహారపానీయాలు అందించింది. మతంతో సంబంధం లేకుండా అక్కడి నిరుపేద పిల్లల కోసం  అనేక పాఠశాలలను కూడా స్థాపించింది. వృద్ధాశ్రమాలను కూడా నిర్వహిస్తున్నది.
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
