ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో కెన్యాకు చెందిన మహిళపై ఫిర్యాదు ఒట్టిదేనని పోలీసులు తెలిపారు.
ఈమేరకు పోలీసులు ఆమె ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ పింటూను అదుపులోకి తీసుకుని విచారించగా .. ఎలాంటి దాడి జరగలేదని పేర్కొన్నాడు. అంతేకాదు, బాధితురాలు చెబుతున్నట్లుగా ఆ సమయంలో ఎలాంటి గొడవలు ఆప్రాంతంలో చోటుచేసుకోలేదని సమీపంలోనే ఉన్న పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. సీసీఫుటేజిలోనూ దాడి జరిగిన ఆనవాళ్లు లేవు. దాడి ఘటన నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం స్పందించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది. దీంతో మరింత దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలు చికిత్స పొందినట్లుగా చెబుతున్న రెండు ఆస్పత్రుల్లోనూ వివరాలు సేకరించారు.
ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని, దెబ్బలు తగల్లేదని వైద్యులు వెల్లడించారు. వీటన్నిటిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. బహుశా.. బాధితురాలు స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో జరిగిన ఘర్షణతో ఈ విధమైన ఫిర్యాదు చేసి ఉంటుందని భావిసు‍్తన్నట్లు అందులో వివరించారు. ఇదే విషయాన్ని కెన్యా రాయబార కార్యాలయం అధికారులకు వివరించామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మేంద్రయాదవ్ తెలిపారు. ఆఫ్రికన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చార్లెస్ మాట్లాడుతూ.. కెన్యా మహిళ తప్పుడు ఫిర్యాదు చేసిందని రుజువైందని, పోలీసులు తమకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారని వివరించారు.


