కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ

Kartarpur Corridor Will Be Opened November 8 By Prime Minister Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ : గురునానక్‌ దేవ్‌ సమాధి నెలకొన్న దర్బార్‌ సాహిబ్‌ను కలుపుతూ భారత్‌, పాకిస్థాన్‌లు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాయి. గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా నవంబర్‌ 8న కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. డేరా బాబా నానక్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్‌ గురుద్వారాను అనుసంధానించే 4.5 కిలోమీటర్ల పొడవైన రహదారి నవంబరు 8న ప్రారంభం కానుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ శనివారం మాట్లాడుతూ.. కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 8న ప్రారంభిస్తారని చెప్పారు. అంతకుముందు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి రాష్ర్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో పాటు ఆయన నేతృత్వంలో అన్ని పార్టీల సభ్యులతో కూడిన బృందాన్ని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆహ్వానించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. గురు నానక్ దేవ్ 550వ ప్రకాశ్ పర్వ్ ఉత్సవాలను నవంబరులో నిర్వహిస్తారు. భారతదేశంలోని సిక్కులు కర్తార్‌పూర్ కారిడార్ గుండా పాకిస్థాన్‌లోని గురు నానక్ గురుద్వారాకు చేరుకుంటారు. పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబరు 9న ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భారత దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. అదే రోజు భారతదేశం నుంచి కర్తార్‌పూర్ వెళ్ళే తొలి భక్త బృందంలో పాల్గొనాలని కెప్టెన్ అమరీందర్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారాకు వెళ్లనున్న తొలి అఖిలపక్ష జాబితా (సిక్కుల ప్రతినిధి బృందం)లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా ఉండనున్నారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కర్తార్‌పూర్‌ కారిడార్‌ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. గురునానక్‌ దేవ్‌ 550వ గురుపూరబ్‌ సందర్భంగా కారిడార్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top