
కాన్పూర్: యూపీలో 'ఐ లవ్ పాకిస్తాన్' అని రాసి ఉన్న బెలూన్లు కలకలం సృష్టించాయి. బెలూన్లను విక్రయిస్తున్న ఓ దుకాణాన్ని కాన్పూర్ పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాన్పూర్‌లోని గోవింద్‌నగర్‌లో ఉన్న ఓ దుకాణంలో ఐ లవ్ పాకిస్తాన్, హబీబీ అని ముద్రించి ఉన్న బెలూన్లను విక్రయిస్తున్నారు. హిందూ యువ వాహినికి చెందిన లాయర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల తన కుమారుడు బర్త్‌డే వేడుకకు గాను ఇక్కడి నుంచే బెలూన్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి బెలూన్లపై రాతలను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దుకాణం నిర్వాహకులైన సన్నీ, సమీర్ విజ్ లను అదుపులోకి తీసుకున్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు యత్నించిన నేరానికి వారిపై సంబంధిత సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని ప్రముఖ హోల్‌సేల్ మార్కెట్ అయిన సదర్ బజార్‌లోని గబ్బరె వాలీగలీ నుంచి కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. ఇటువంటి అభ్యంతరకర రాతలున్న బెలూన్లను ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని పోలీస్ ఇన్స్‌పెక్టర్ జనరల్ అలోక్ సింగ్ తెలిపారు.