బార్‌ అసోషియేషన్‌ ఆహ్వానం తిరస్కరణ

Justice J Chelameswar Refused His Farewell Invitation By Bar Association - Sakshi

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ చలమేశ్వర్‌ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేకించి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నిర్ణయాలపై సర్వత్త్రరా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా.. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించాలనుకోగా అందుకు సాధ్యం కాలేదు. బార్‌ అసోసియేషన్‌ ఆహ్వానాన్ని జస్టిస్‌ చలమేశ్వర్‌ సున్నితంగా తిరస్కించారు.

సుప్రీంకోర్టులో సీనియర్‌ జడ్జీగా కొనసాగుతున్న జస్టిస్‌ చలమేశ్వర్‌ పదవీకాలం జూన్‌ 22 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బార్‌ అసోషియేషన్‌ ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించాలని భావించింది.  వేసవి కాలం సెలవులకు ముందు సుప్రీంకోర్టు చివరి పనిదినమైన ఈ నెల 18న వీడ్కోలు కార్యక్రమ సభ నిర్వహించాలని బార్‌ అసోషియేషన్‌ భావించింది. అందులో భాగంగా అసోసియేషన్ సభ్యులు గతవారం జస్టిస్‌ చలమేశ్వర్‌ను కలిసి కార్యక్రమం గురించి వివరించగా అందుకు జస్టిస్‌ చలమేశ్వర్‌ అంగీకరించలేదు. దాంతో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు బుధవారం మరోసారి జస్టిస్‌ చలమేశ్వర్‌ని కలిసి ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఆ సందర్భంగా జస్టిస్‌ చలమేశ్వర్‌ బార్‌ అసోషియేషన్‌ సభ్యులతో మాట్లాడుతూ.. ‘గతంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి బదిలీ అయినప్పడు కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటే నేను ఒప్పుకోలేదు’ అని చెప్పారు. ఇదే అంశంపై బార్‌ అసోషియేషన్‌ గౌరవ కార్యదర్శి విక్రాంత్‌ యాదవ్‌ స్పందిస్తూ,  అసోసియేషన్త తరఫున  సీనియర్‌ జస్టిస్‌ చలమేశ్వర్‌ను వీడ్కోలు సభ ఏర్పాటు చేయాలని భావించినా అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. పదవీ విరమణ పొందుతున్న జడ్జీలకు న్యాయస్థానం వేసవి సెలవులను ప్రకటించడానికి ముందు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీ వస్తుందన్నారు. ఇలావుండగా, జస్టిస్‌ చలమేశ్వర్‌ బుధవారం రోజున విధులకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టు జడ్జీలలో వారం వారం ఒకరు వంతుల వారీగా తమ సొంత రాష్ట్ర వంటకాలతో (ఘర్‌ కా ఖానా) విందు  ఇస్తున్న విషయం తెలిసిందే.  అందరూ కలిసి ఒకే చోట విందు భోజనం చేస్తున్న సంప్రదాయ కార్యక్రమానికి కూడా గత మూడు బుధవారాల నుంచి జస్టిస్‌ చలమేశ్వర్‌ దూరంగా ఉంటున్నారని తెలిసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top