గగనతలంలో మరో విజయం.. పీఎస్ఎల్వీ సీ-29 విజయవంతం! | isro launches new pslv c 29 rocket at srihari kota | Sakshi
Sakshi News home page

గగనతలంలో మరో విజయం.. పీఎస్ఎల్వీ సీ-29 విజయవంతం!

Dec 16 2015 8:11 PM | Updated on Sep 3 2017 2:06 PM

గగనతలంలో మరో విజయం.. పీఎస్ఎల్వీ సీ-29 విజయవంతం!

గగనతలంలో మరో విజయం.. పీఎస్ఎల్వీ సీ-29 విజయవంతం!

ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది.

శ్రీహరికోట: ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది.  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహారికోట షార్‌ కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 6.00 గంటలకు పోలార్‌ లాంచింగ్ శాటిలైట్‌ వెహికల్‌ (పీఎస్ఎల్వీ) సీ-29 రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగం. సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఈ రాకెట్‌ వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

59 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం నింగిలోకి ఎగిరిన పీఎస్‌ఎల్వీ సీ29..  ఉత్కంఠభరితంగా దూసుకుపోతూ వివిధ దశలను దాటుకుంటూ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఇస్రో చేపట్టిన 33వ ప్రయోగం. 400 కిలోల బరువున్న టెలియోస్‌ ఉపగ్రహంతోపాటు ఐదు చిన్న ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ కక్ష్యకు చేర్చింది. ఈ ఘట్టాన్ని ఉత్కంఠగా వీక్షిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల్లో రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో ఆనందం వెల్లివిరిసింది.

ఇస్రోకు నమ్మకమైన రాకెట్‌ పీఎస్‌ఎల్వీ. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇస్రోకు ఇది తిరుగులేని విజయాల్ని అందిస్తూ వస్తున్నది. ఈ ఏడాది జూన్ 10న పీఎస్‌ఎల్వీ సీ 28 ద్వారా ఐదు విదేశీ ఉపగ్రహాలను, సెప్టెంబర్ 28న పీఎస్‌ఎల్వీ సీ 30 ద్వారా మరో కార్టోశాట్‌ను విజయవంతంగా రోదసిలోకి పంపింది. ఇప్పటివరకు 81 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించగా ఇందులో 51 విదేశీ ఉపగ్రహాలు, 30 స్వదేశీ ఉపగ్రహాలు కావడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement