భారత్‌లో రెండో కరోనా కేసు..!

Indians Reached Delhi From Wuhan Airport - Sakshi

సాక్షి, తిరువనంతపుం: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కేరళలో మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతను ఇటీవల చైనాలో పర్యటించి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా కేసుతో ఇప్పటి వరకు భారత్‌లో రెండు కరోనా కేసులు నమోదు కాగా రెండూ కూడా కేరళలోనే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌ ప్రభావం వల్ల చైనా వెలుపల ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం నమోదైంది. మరణించిన వ్యక్తి వుహాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. 
 
(కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే.. రోడ్లపైకి తోసేస్తున్నారు..!)

చెన్నై ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం
అయితే ఈ వైరస్‌ రోజు రోజుకు దేశాలు, రాష్ట్రాలను దాటేస్తోంది. చెన్నై ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్ కలకలం రేపింది. వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ అనే వ్యక్తి మలేషియా నుంచి చెన్నై వచ్చాడు. రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా.. మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నారు.

(కరోనా ఎఫెక్ట్స్‌: ఢిల్లీ చేరుకున్న 324 మంది భార‌తీయులు)

చైనా నుంచి భారత్‌ చేరుకున్న రెండో బృందం
చైనాలో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా వుహాన్‌ సిటీకి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపి.. మొదటి విడతలో 324 మందిని ఢిల్లీకి తీసుకువచ్చారు. వచ్చిన వారిలో ఏపీకి చెందిన 56 మంది ఇంజనీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. కాగా రెండో విడతలో 323 మంది ఆదివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున వుహాన్‌ నుంచి బయలుదేరిన రెండవ బృందం ఎయిర్‌ ఇండియా విమానంలో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 304కు పెరిగింది. అంతేకాదు చైనా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయితే.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14,380 కు పెరిగింది. కేసుల్లో ఎక్కువ భాగం చైనాలో నమోదయ్యాయి. మరో 23 దేశాలలో సుమారు 100 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top