సెలవులకు భారత ఉద్యోగులు దూరం!

Indians Employees Most Vacation Deprived, Finds Survey - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగం చేస్తున్న భారతీయులు సెలవులుపెట్టి పండుగలకు పబ్బాలకు ఊర్లకు వెళ్లడం, కాశి, కన్యాకుమారి యాత్రలకు వెళ్లడం, ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఊటి, కొడై కెనాల్‌కు పయనం అవడం మనకు తెల్సిందే. అయితే ప్రపంచంలో అతి తక్కువగా సెలవులు వాడుకునేది భారతీయ ఉద్యోగులేనట. ఈ విషయాన్ని 19 దేశాల్లో సర్వేచేసి అమెరికాలోని పర్యాటక సంస్థ ‘ఎక్స్‌పీడియా’ తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత ఉద్యోగులు 75 శాతం మంది సెలవులపై వెళ్లలేదట. అదే స్పెయిన్‌లో 48 శాతం మంది, బ్రిటన్‌లో 47 శాతం మంది సెలవులపై వెళ్లలేదు.

ఈ 75 శాతం మందిలో ఆరెనెలల నుంచి ఏడాది వరకు, ఏడాదికిపైగా ఒక్క రోజు కూడా సెలవులు పెట్టని వారు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక రోజు నుంచి పది రోజుల వరకు సెలవు తీసుకున్న భారత ఉద్యోగులు  41 శాతం కాగా, అదే స్పెయిన్‌లో ఇరవై ఒక్క రోజు నుంచి 30 రోజుల వరకు సెలవులు తీసుకున్న వారి సంఖ్య 64 శాతం. సర్వేలో పాల్గొన్న భారత ఉద్యోగుల్లో ఏడాదికిపైగా సెలవు తీసుకోని వారు 17 శాతంకాగా, ఆరు నెలల నుంచి ఏడాది వరకు సెలవు తీసుకోని వారి సంఖ్య 36 శాతం, మూడు నుంచి ఆరు నెలల వరకు సెలవు తీసుకోని వారు 27 శాతం, నెల నుంచి మూడు నెలల వరకు సెలవులు తీసుకోని వారి సంఖ్య 17 శాతం, తరచుగా సెలవులు తీసుకునే వారి సంఖ్య ఆరు శాతమని అధ్యయనంలో తేలింది.

సెలవులు తీసుకోక పోవడానికి కారణాలు
1. మున్ముందు అత్యవసరం రావచ్చనే ఉద్దేశంతో సెలవులు తీసుకోని ఉద్యోగుల సంఖ్య 46 శాతం.
2. పని ఒత్తిడి ఎక్కువగా ఉండి, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల సెలవులు తీసుకోని వారి సంఖ్య 35 శాతం.
3. నాకు, నా జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు ఒకేసారి సెలవులు ప్లాన్‌ చేసుకోవడం కుదరకపోవడం వల్ల సెలవులకు దూరం అవుతున్న వారి సంఖ్య 33 శాతం.
4. వ్యక్తిగత షెడ్యూల్‌ సెలవులకు అనుమతించకపోవడం అంటున్న వారి సంఖ్య 31 శాతం.
5. డబ్బు కోసం సెలవులను అమ్ముకోవడం వల్ల వెళ్లలేకపోతున్న వారి సంఖ్య 31 శాతం.
6. నేను లేకుండా ఆఫీసులో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న కారణంతో 25 శాతం
7. డబ్బులేక, సెలవులకు ఖర్చుపెట్టే స్థోమత లేక 24 శాతం.
8. కెరీర్‌లో పైకి రావాలంటే వృత్తికి అతుక్కుపోయి పనిచేయాలనుకోవడం వల్ల సెలవులకు దూరం అంటున్న వారి సంఖ్య 18.
9. సెలవులపై వెళ్లేందుకు సమయమే దొరకదు అంటున్న వారి సంఖ్య పది శాతం.
10. సెలవులను వాడుకుంటామంటున్న వారు ఆరు శాతం.
సెలవులపై వెళ్లాలనుకుని బాస్‌లు సెలవులు ఇవ్వకపోవడం వెల్లని వారి సంఖ్య కూడా భారతీయుల్లో ఎక్కువగానే ఉంటుంది. వారి గురించి తెలియలేదంటా సర్వేలో పాల్గొన్న వారిని ఈ ప్రశ్న అడిగి ఉండకపోవచ్చు. సెలవుపై వెళ్లి కూడా ఆఫీసు పనులు చూసుకునే వారి సంఖ్య 32 శాతమని తేలింది. మొత్తం 19 దేశాల్లో సర్వే చేశామని చెప్పిన అమెరికా పర్యాటక ఏజెన్సీ ‘ఎక్స్‌పీడియా’ భారత్, స్పెయిన్, బ్రిటన్‌ దేశాల పేర్లను మినహా మిగతా 13 దేశాల పేర్లను వెల్లడించలేదు. ఇక్కడ అవసరం లేదని అనుకోవచ్చేమో!


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top