విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నాం

India Witnessed Reform Momentum Says By Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ  ప్రధానమంత్రిగా రెండవ సారి బాధ్యతలు  చేపట్టి  ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ తన సర్కార్‌ విజయాలపై సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు. 130 కోట్ల మంది ప్రజానీకానికి సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాశ్‌, సబ్‌ కా విశ్వాస్ అనే లక్ష్యంగా ముందుకు  సాగుతున్నామని వెల్లడించారు. తన ప్రభుత్వ విజయాలపై, లక్ష్యాలను ట్విటర్‌లో పేర్కొన్నారు.  ప్రభుత్వ పనితీరుపై పలు అంశాలను తన వరుస ట్వీట్లలో​ ప్రస్తావించారు. ముఖ్యంగా  కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, ఆర్థిక సంస్కరణలు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, కార్పొరేట్‌ పన్ను రేట్లను 22శాతానికి తగ్గించామని అన్నారు. కొత్తగా స్థాపించబోయే స్థానిక తయారీ కంపెనీలకు 15శాతం పన్ను రాయితీలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు. దేశానికి కీలకమైన బ్యాంకింగ్‌ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు బ్యాంక్‌ల విలీన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. రైతుల గురించి మోదీ స్పందిస్తూ ప్రధానమంత్రి కిసాన్‌ పథకం ద్వారా 14 కోట్ల మంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పందించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి నిర్మాణాత్మ​క చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా అన్ని రంగాల్లో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top