ఆందోళన జరిగితే నెట్‌ కట్‌

India is the internet shutdown capital of the world - Sakshi

2018లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌

ఈ ఏడాది 90 సార్లు

రికార్డు సృష్టిస్తున్న భారత్‌

కశ్మీర్‌లో కల్లోలం.. ఇంటర్నెట్‌ కట్‌ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తం.. సమాచారం షట్‌ డౌన్‌ సున్నిత అంశాలపై కీలక తీర్పు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవ్‌ ఏ ఆందోళనకైనా, ఏ నిరసనకైనా అదే తంత్రం, అదే వ్యూహం  

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవడంతో పది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్‌ సేవల్ని 24 గంటల సేపు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పుడే కాదు 2018లో భారత్‌లో పలు సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ అయ్యాయి. భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం ఇవాళ, రేపు చాలా దేశాల్లో జరుగుతోంది. ఆందోళనల్ని అణచివేయాలంటే ప్రజలకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేయడమే మార్గమన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి.భారత్‌తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్‌ హౌస్‌ సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఇంటర్నెట్, డిజిటల్‌ మీడియా స్వేచ్ఛపై 65కు పైగా దేశాల్లో ఈ సంస్థ సమగ్ర అధ్యయనాన్నే నిర్వహించింది.

ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు
మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్, ఫోన్‌ సేవల్ని నిలిపివేశారు.
► 2016లో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బర్హన్‌ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి.

►  కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్‌ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగస్టు 4 నుంచి కశ్మీర్‌లో ఇంటర్నెట్, ఫోన్‌ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్‌ సేవలు పునరుద్ధరించారు కానీ, 130 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్‌ ఇంకా వాడకంలోకి రాలేదు.  

► 2016లో పశ్చిమ బెంగాల్‌ డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్నెట్‌ షట్‌ డౌన్‌ చేశారు.

► 2015లో గుజరాత్‌లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు డిమాండ్‌ చేస్తూ పటీదార్‌ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి.  

► గత నెలలో రామజన్మ భూమి తీర్పుకు ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ బంద్‌ అయింది.

ఏ ఏడాది ఎన్నిసార్లు  
2017     79
2018     134
2019     90
2012 నుంచి లెక్కల్ని చూసుకుంటే 360సార్లకు పైగా దేశంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి.  

హోంశాఖకి అధికారాలు
ప్రజల భద్రత కోసం ఇంటర్నెట్, టెలిఫోన్‌ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, ఆంక్షలు విధించడానికి 2017లో ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టంలోని కొన్ని నిబంధనల్ని చేర్చారు.. దీని ప్రకారం కేంద్ర హోంశాఖ, హోంశాఖ కార్యదర్శులకు తాత్కాలికంగా ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేసే అధికారం ఉంటుంది. అయితే అయిదు రోజుల తర్వాత పరిస్థితుల్ని తప్పనిసరిగా సమీక్షించాలి.

ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కు
భారత్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకి కూడా ఇంటర్నెట్‌ సేవల వినియోగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేరళ హైకోర్టు ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. రోజుల తరబడి ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేయడం చట్టవ్యతిరేకమని సెంటర్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ సొసైటీ సభ్యుడు ప్రణేష్‌ ప్రకాశ్‌ అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top