పేలుళ్లపై ముందే హెచ్చరించాం

India had alerted Lanka against possible IS attack - Sakshi

కోయంబత్తూరులో ఐసిస్‌ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తుచేసినప్పుడే

పేలుళ్లపై సమాచారమొచ్చింది

నాడే శ్రీలంకకు సమాచారం ఇచ్చాం

ఈస్టర్‌ పేలుళ్లపై భారత అధికారులు

న్యూఢిల్లీ: కోయంబత్తూరులో ఐసిస్‌ కేసు విచారణను ముగించిన వెంటనే, ఆ ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు, శ్రీలంకలో బాంబు దాడులు జరగొచ్చనే నిఘా హెచ్చరికలను శ్రీలంకకు ఈ నెల మొదట్లోనే పంపామని అధికారులు ఢిల్లీలో చెప్పారు. ఐసిస్‌ను స్ఫూర్తిగా తీసుకుని దక్షిణ భారతంలోని ప్రముఖ నేతలను చంపాలని కుట్రపన్నిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పట్టుకుని కోయంబత్తూరులో విచారించడం తెలిసిందే. ఆ హెచ్చరికలను రాయబార కార్యాయలం ద్వారా శ్రీలంకకు పంపామని అధికారులు తెలిపారు.

కోయంబత్తూరులో విచారణ సమయంలో ఆ ఉగ్రవాదుల వద్ద నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ (ఎన్‌టీజే) నేత జహ్రాన్‌ హషీమ్‌ వీడియోలు లభించాయి. కొలంబోలోని భారత హై కమిషన్‌పై ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు జహ్రాన్‌ హషీమ్‌ ఓ వీడియోలో సూత్రప్రాయంగా చెప్పాడు. మరింత లోతుగా విచారణ జరపగా, ఐసిస్‌ సహకారంతో ఉగ్రవాదులు చర్చిలు లక్ష్యంగా పేలుళ్లు జరిపేందుకు అవకాశం ఉందని తెలిసింది.ఈ సమాచారాన్ని వెంటనే శ్రీలంకకు తెలియజేశామని అధికారులు చెప్పారు. ఇస్లాం రాజ్యస్థాపనకు ముందుకు రావాల్సిందిగా శ్రీలంక, తమిళనాడు, కేరళ యువతను హషీమ్‌ కోరుతున్నట్లు మరో వీడియోలో ఉంది.

ఇద్దరు రాజీనామా చేయండి: అధ్యక్షుడు
పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను రాజీనామా చేయాల్సిందిగా శ్రీలంక అధ్యక్షుడు  సిరిసేన ఆదేశించినట్లు సండే టైమ్స్‌ అనే ప్రతిక బుధవారం తెలిపింది. రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో, దేశ పోలీస్‌ చీఫ్‌ పూజిత్‌ జయసుందరలను రాజీనామా చేయమని సిరిసేన కోరారంది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారం నాటికి 359కి చేరింది. పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగ అధికార ప్రతినిధి రువాన్‌ గుణశేఖర చెప్పారు. ఈ పేలుళ్లలో 500 మందికి పైగా ప్రజలు గాయపడటం తెలిసిందే. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులంతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top