వాతావరణ లక్ష్యాలను అందుకోవాల్సిందే 

India at the Conference of Ministers of the United Nations on Climate Change - Sakshi

పారిస్‌ ఒప్పందంలో  మార్పులకు ఛాన్స్‌ లేదు

కటోవైస్‌ సదస్సులో స్పష్టం చేసిన భారత్‌  

కటోవైస్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ప్రపంచదేశాలు 2016లో కుదుర్చుకున్న వాతావరణ ఒప్పందంలో ఎలాంటి మార్పులుచేర్పులకు అవకాశం లేదని భారత్‌ తెలిపింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నీ నిర్దేశిత గడువులోగా తమ లక్ష్యాలను అందుకోవాలనీ, బాధ్యతలను నిర్వర్తించాలని స్పష్టం చేసింది. పోలెండ్‌లోని కటోవైస్‌ నగరంలో జరుగుతున్న వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి మంత్రుల సదస్సులో భారత్‌ తరఫున కేంద్ర పర్యావరణశాఖ అదనపు కార్యదర్శి ఏకే మెహతా మాట్లాడుతూ..‘పారిస్‌ ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయలేమని మనందరికీ తెలుసు. ఒప్పందం సందర్భంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య కుదరిన అంగీకారాన్ని కాపాడుకోవాలి. నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా అందుకోవాలి. పారిస్‌ ఒప్పందంలోని అన్ని అంశాలతో పాటు ప్రపంచ దేశాలను కలుపుకునిపోయేలా ఏకాభిప్రాయంతో కటోవైస్‌ సదస్సు తుది ఫలితాలు ఉండాలి. ఈ సందర్భంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్రంగా నష్టపోయే పేదలు, బలహీనవర్గాలకు మనం అండగా నిలవాలి’అని తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తరఫున మెహతా ఈ సదస్సులో పాల్గొన్నారు.
 
‘ప్రపంచంలో అందుబాటులో ఉన్న సహజవనరులను అన్నివర్గాలకు సమానంగా దక్కేలాచేయడం చాలా ముఖ్యం. ఇందుకు సంబంధించి ఎంతమేరకు పురోగతి సాధించామో పారిస్‌ సదస్సులో సమీక్షించుకున్నాం. నిర్దేశిత లక్ష్యాలను 2020 నాటికి అందుకునేలా ప్రపంచదేశాలన్నీ చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్య ఉద్గారాల విడుదల, మిగతాదేశాలకు సాయంపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఖతార్‌ రాజధాని దోహాలో వాతావరణ సదస్సు సందర్భంగా కుదిరిన ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం’అని మెహతా పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై ఐరాస కార్యాచరణ ఒప్పందం(యూఎన్‌ఎఫ్‌సీసీసీ)లో భాగంగా దేశాల సామర్థ్యం ఆధారంగా వాటికి నిర్దేశిత లక్ష్యాల(సీబీడీఆర్‌–ఆర్‌సీ)ను అప్పగించే నిబంధనను నీరు గార్చేందుకు అమెరికా, ఈయూ సహా అభివృద్ధి చెందిన దేశాలు ప్రయత్నిస్తున్న వేళ భారత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.    
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top