క్లాస్‌లో కౌగిలింత.. కట్‌ చేస్తే...

Hugging Row Kerala Student Scores 91 Percent in CBSE Exam - Sakshi

తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన ‘విద్యార్థుల కౌగిలింత’ వ్యవహారం గుర్తుండే ఉంటుంది. క్లాస్‌ రూమ్‌లోనే జూనియర్‌ విద్యార్థినిని గాఢంగా కౌగిలించుకున్న ఓ విద్యార్థి.. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో క్రమశిక్షణ పేరిట స్కూల్‌ యాజమాన్యం వాళ్లను సస్పెండ్‌ చేయగా, పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తూ సీబీఎస్‌ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే న్యాయ పోరాటం తర్వాత విజయం సాధించిన ఆ విద్యార్థి ఎట్టకేలకు పరీక్షలు రాసి శనివారం విడుదలైన సీబీఎస్‌ఈ ఫలితాల్లో సత్తా చాటడం విశేషం. 

12 తరగతి పరీక్షల ఫలితాల్లో అతను మొత్తం 91.2 శాతం సాధించాడు. ఆంగ్లంలో 87, ఎకనామిక్స్‌లో 99, బిజినెస్‌ స్టడీస్‌లో 90, అకౌంటెన్సీలో 88, సైకాలజీలో 92 మార్కులు వచ్చాయి. దీనిపై అతని తల్లిదండ్రలు సంతోషం వ్యక్తం చేశారు. ‘న్యాయ పోరాటం తర్వాత మా అబ్బాయి పరీక్షలకు అనుమతి లభించింది. కానీ, అప్పటికే తరగతులన్నీ అయిపోయాయి. అయినప్పటికీ కష్టపడి చదివాడు. ఫలితం సాధించాడు’ అని విద్యార్థి తండ్రి చెప్పారు.    

అసలేం జరిగింది... గతేడాది తిరువనంతపురంలోని సెయింట్‌ థామస్‌ సెంట్రల్‌ స్కూల్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో 12వ తరగతి చదువుతున్న స్టూడెంట్‌.. జూనియర్‌ విద్యార్థినిని  క్లాస్‌రూమ్‌లో  కౌగిలించుకొని ఫోటోలు దిగాడు. వాటిని కాస్త ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్టు చేయటం, అది స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్లటంతో వారిద్దరినీ సస్పెండ్ చేసింది. దీంతో బోర్డు పరీక్షలకు ఆ విద్యార్థిని అనర్హుడిగా ప్రకటించింది. ఈ ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. 

విద్యార్థి ఫిర్యాదుతో జోక్యం చేసుకున్న బాలల హక్కుల సంఘం, స్కూల్‌ యాజమాన్యాన్ని మందిస్తూ తిరిగి చేర్చుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్కూల్‌ యాజమాన్యం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే విద్యార్థుల క్రమశిక్షణ విషయం స్కూల్‌ పరిధిలోనే ఉంటుందని, అలాగని పరీక్షలు రాయనీయకపోవటం సమంజసం కాదన్న అభిప్రాయం ‍వ్యక్తం చేసిన కోర్టు తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. చివరకు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ జోక్యంతో స్కూల్‌ యాజమాన్యం వెనక్కి తగ్గింది.విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలంటూ సీబీఎస్‌ఈ బోర్డుకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ లేఖ రాయటంతో వివాదం సర్దుమణిగింది. 

అమ్మాయి పరిస్థితి... సస్పెండ్‌ కావటానికి నెల రోజుల ముందే స్కూల్‌లో విద్యార్థిని చేరటం, పైగా గతంలో ఆమె చదువుకున్న టీసీ ఇవ్వకపోవటంతో ఆమె సస్పెన్షన్‌ విషయంలో సంగ్దిగ్దత నెలకొంది. అయితే అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన ఆ విద్యార్థిని స్కూల్‌ అధికారులు తనపై అనుచిత పదజాలం వాడారంటూ ఆరోపించి కలకలం రేపింది. వాటిని ఖండించిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ చివరకు ఆమెను కూడా పరీక్షలకు అనుమతించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top