2019లో నరేంద్ర మోదీకి అగ్ని పరీక్షే!

how to perform modi govt in economy this year - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నిర్ణయాల వల్ల 2017 సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ పలు కుదుపులకు గురయింది. ఎగువ, దిగువల మధ్య ఊగిసలాటి ఎక్కువగా దిగువకే పడి పోయింది. గతేడాది జనవరి నుంచి మార్చి నెలల మధ్య దేశ జీడీపీ రేటు 6.1 శాతానికి పడిపోయింది. ఇక 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది మరింత పడిపోయి 5.7కు చేరుకుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ నెల నాటికి కొద్దిగా కోలుకొని మళ్లీ 6.3 శాతానికి చేరుకుంది. 

ఇక పారిశ్రామిక ఉత్పాదక రేటు సెప్టెంబర్‌లో 4.1 శాతం ఉండగా, అక్టోబర్‌ నాటికి 2.2 శాతానికి చేరుకుంది. అలాగే వినియోగదారుల ద్రవ్యోల్బణం గత జూన్‌ నెలలో 1.4 శాతం ఉండగా, నవంబర్‌ నెల నాటికి 4.8 శాతానికి చేరుకుంది. అలాగే వ్యవసాయ వద్ధి రేటు జూన్‌ నెలలో 2.3 శాతం ఉండగా, సెప్టెంబర్‌ నెల నాటికి 1.7కు పడిపోయింది. ఇక ప్రజల కొనుగోలు శక్తి ఏప్రిల్‌–జూన్‌ నెలలో 9.5 శాతం ఉండగా, సెప్టెంబర్‌ నెల నాటికి ఆరు శాతానికి పడిపోయింది. 

2017 సంవత్సరం ఉద్యోగాల విషయంలో, ముఖ్యంగా ఐటీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రంగంలో 56 వేల మంది ఉద్యోగులను తీసివేశారు. దిగజారిన ఆర్థిక పరిస్థితికన్నా ఎక్కువ మందికి ఉద్వాసన చెప్పారని, 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం నాటికన్నా ఐటీ రంగంలో ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారని నిపుణులు చెబుతున్నారు. దేశంలో మార్పును తీసుకొస్తానని, ఆర్థిక రంగంపై ప్రత్యేక దష్టిని కేంద్రీకరిస్తానన్న హామీతో 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గోమాంసం తినరాదంటూ చేసిన ప్రభావం కూడా ఆర్థిక రంగంపై పరోక్షంగా ఎంతో ప్రభావం చూపింది. ఈ ఆర్థిక రంగంలోనే 2017లో బాగా దెబ్బతిన్నామంటే వచ్చే ఏడాది ఈ రంగాన్ని పునరుద్ధరించడానికే ప్రత్యేక దష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందన్నది స్పష్టం అవుతోంది.

2018లో ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి నరేంద్ర మోదీ ఆర్థిక ఎజెండాను పక్కన పెట్టి పెటీ రాజకీయాలకు పెద్దపీట వేస్తే మాత్రం 2019లో నరేంద్ర మోదీ అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top