మహిళల భద్రతకు 3వేల కోట్లు | Home ministry sanctions Rs 3,000 cr for special women safety | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు 3వేల కోట్లు

Sep 10 2018 2:55 AM | Updated on Sep 10 2018 2:55 AM

Home ministry sanctions Rs 3,000 cr for special women safety - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌తోపాటు 8 మహానగరాల్లో మహిళల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. దీన్లో భాగంగా వివిధ సౌకర్యాల కల్పనకు ‘నిర్భయ’ నిధుల నుంచి రూ.3,000 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఆపదలో ఉన్నట్లు బాధితులు సమాచారం పంపే ప్యానిక్‌ బటన్స్, మహిళా పోలీస్‌ గస్తీ బృందాలతోపాటు ఫోరెన్సిక్, సైబర్‌ క్రైం నిపుణులతో కూడిన పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాలు, స్మార్ట్‌ ఎల్‌ఈడీ వీధి దీపాలను అందుబాటులోకి తేనున్నట్లు హోం శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.  

ప్రతిపాదిత చర్యలివీ..
► మహిళలకు సమగ్ర భద్రతే లక్ష్యంగా ప్రకటించిన ఈ పథకంలో షీ–టీమ్స్‌ తరహాలో మహిళా పోలీసు గస్తీ బృందాలు, అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందించేందుకు ‘అభయం’ పేరుతో పోలీస్‌ వ్యాన్‌ల ఏర్పాటు.  

► బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, చిన్నారులకు భద్రతను కల్పించేందుకు, వారిలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నేరాలకు అవకాశమున్న చోట్ల ‘రక్షిత’ ప్రాంతాల అభివృద్ధి, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, సీసీటీవీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానిస్తారు.  

► ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతా చర్యలు, ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను అప్రమత్తం చేసే ప్యానిక్‌ బటన్లను అమర్చడం, సురక్షిత ప్రాంతాల్లో టాయిలెట్లు, చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాల(డార్మిటరీలు)ను అందుబాటులోకి తెస్తారు.

► బాధితులు నిర్భయంగా పోలీస్‌ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వటానికి, తక్షణ సాయం పొందటానికి వీలుగా మహిళా హెల్ప్‌ డెస్క్‌లు, మహిళా కౌన్సిలర్లు, సైబర్‌ క్రైం, ఫోరెన్సిక్‌ నిపుణుల నియామకం.


ఏ నగరానికి ఎంత?
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ ఘటన నేపథ్యంలో 2013లో కేంద్రం నిర్భయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన కార్యక్రమానికి ‘నిర్భయ’ నిధి నుంచి రూ.2,919.55 కోట్లను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. 2018–19, 2020–21 సంవత్సరాల్లో అమలయ్యే ఈ పథకానికి గాను ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, చెన్నైకి రూ.425.06 కోట్లు, అహ్మదాబాద్‌కు రూ.253 కోట్లు, కోల్‌కతా రూ.181.32 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు , హైదరాబాద్‌కు రూ.282.50 కోట్లు, లక్నోకు రూ.195 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60: 40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌’ బ్యూరో గణాంకాల ప్రకారం.. 2015లో మహిళలపై దేశవ్యాప్తంగా 3,29,243 నేరాలు జరగ్గా 2016 నాటికి 3,38,954కు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement