‘ఎలక్ట్రిక్‌’కు కొత్త పవర్‌!!

GST Council slashes tax rates on electric vehicles, chargers - Sakshi

వాహనాలపై జీఎస్‌టీ 7 శాతం తగ్గింపు

ప్రస్తుతం 12 శాతం...ఇకపై 5 శాతమే

జీఎస్‌టీ మండలి నిర్ణయం

న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల రవాణా సదుపాయాల్ని ప్రోత్సహించే క్రమంలో కేంద్ర జీఎస్‌టీ మండలి శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేటు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉపయోగించే ఛార్జర్లు, ఛార్జింగ్‌ స్టేషన్లపై కూడా జీఎస్‌టీని ప్రస్తుత 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.

అంతేకాకుండా మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలు గనక 12 మంది కన్నా ఎక్కువ మందిని రవాణా చేయటానికి ఎలక్ట్రిక్‌ వాహనాలను అద్దెకు తీసుకుంటే... వాటిపై పూర్తిగా జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. ఈ నిర్ణయాలన్నీ ఆగస్టు 1 నుంచీ అమల్లోకి వస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశానంతరం ఆర్థిక శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటీవలి బడ్జెట్లో సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల్ని ప్రోత్సహించడానికి కేంద్రం కొన్ని చర్యలు ప్రకటించింది. కొన్ని విడి భాగాలపై కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించటంతో పాటు... రుణంపై గనక ఎలక్ట్రిక్‌ వాహనం కొంటే... దానికి చెల్లించే వడ్డీలో 1.5 లక్షలకు పన్ను రాయితీ ఉంటుందని కూడా ప్రకటించింది. తాజా మండలి సమావేశంలో జీఎస్‌టీ చట్టానికి సంబంధించిన సవరణలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు.

అవి..
► ప్రత్యేక సేవలందించే సప్లయర్లు తాము పన్ను చెల్లిస్తామని జీఎస్‌టీ సీఎంపీ–02 ద్వారా సమాచారమిస్తూ దాన్ని ఫైల్‌ చేయటానికి ప్రస్తుతం చివరి తేదీ జులై 31గా ఉంది. దాన్ని సెప్టెంబరు 30కి పొడిగించారు.  
► జూన్‌ త్రైమాసికానికి సంబంధించి సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పత్రాల్ని జీఎస్‌టీ సీఎంపీ–08 ద్వారా దాఖలు చేయటానికి కూడా గడువును జులై 31 నుంచి ఆగస్టు 31కి పొడిగిచారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top