
ముంబై: 2019లో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి ‘ఎన్నికల బడ్జెట్’ను ప్రవేశపెట్టిందని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ విమర్శించారు. ‘ఇదో ఎన్నికల బడ్జెట్. అందువల్లే కేంద్రం ధ్యాస పరిశ్రమల నుంచి రైతులు, విద్య, ఆరోగ్య రంగాలపైకి మళ్లింది. గుజరాత్ ఎన్నికల ఫలితాలతో పాటు వస్తుసేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దుపై విమర్శలు వెల్లువెత్తడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల సర్వీస్ చార్జీలు గత కొంతకాలంగా పెరుగుతూనే ఉన్నాయి. దీన్నుంచి సామాన్యుడికి ఉపశమనం లభించేదెప్పుడు? ఈసారి బడ్జెట్‌లో శానిటరీ నాప్‌కీన్స్‌పై జీఎస్టీని తగ్గిస్తారని మహిళలందరూ ఆశించారు. కానీ దాని ఊసేలేదు. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గడంపై కేంద్రం మాట్లాడుతోంది. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడంపై ప్రభుత్వం ప్రజలకు జవాబివ్వాలి’అని సావంత్ తెలిపారు.