ఎకానమీ కోసం మరో ప్యాకేజ్‌!

Government considering another package to minimize lockdown impact - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా భారీగా దెబ్బతింటున్న ఆర్థిక రంగాన్ని పునరుత్తేజపరిచేందుకు మరో ప్యాకేజ్‌ను ప్రకటించే విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. లాక్‌డౌన్‌ తరువాత ఆర్థిక రంగంలో నెలకొననున్న వివిధ పరిస్థితులను బేరీజు వేస్తోంది. అయితే, మరో ప్యాకేజ్‌ను ప్రకటించే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత అధికారులు  వెల్లడించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితులను అంచనా వేసే పనిలో ఉన్నామన్నారు. అలాగే, కొన్ని సంక్షేమ, ఇతర ప్రభుత్వ పథకాలను లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితులకు అనుగుణంగా మార్చే అవకాశాలపై కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు.

కరోనా వల్ల ఆర్థిక రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే దిశగా ఏదైనా నిర్ణయం ప్రకటిస్తే.. అది కేంద్రం తీసుకున్న మూడో నిర్ణయమవుతుంది. ప్రధాని మోదీ మార్చి 24న లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి కొద్ది గంటల ముందు.. ఆర్థికమంత్రి  పన్ను చెల్లింపుదారులు, పారిశ్రామిక వేత్తలకు కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించారు. రెండు రోజుల తరువాత మార్చి 26న కరోనా ప్రభావిత రంగాలను ఆదుకోవడం కోసం రూ. 1.7 లక్షల కోట్ల రిలీఫ్‌ ప్యాకేజ్‌ను కూడా ప్రకటించారు. కోవిడ్‌ 19పై పోరు కోసం ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన 10 సాధికార బృందాల్లో ఒకటి ఆర్థిక రంగ పునరుత్తేజంపై పని చేస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితులను సమీక్షిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top