ఎన్నికలవేళ.. పాత్రికేయులకు గూగుల్‌ ప్రత్యేక పాఠాలు

Google News Initiative PollCheck Covering Indias Election tobe start from Feb26 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలు సమీపిస్తుండటంతో అసత్య వార్తల వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ ఇంట‌ర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ‌ జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెబ్‌సైట్లకు తోడు, సోషల్ మీడియాలోనూ తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు బాగా ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి సమాచారం, వార్తలు జనాలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.  తప్పుడు వార్తలను తెలుసుకునేందుకు, మరింత నాణ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో డిజిటల్‌ లీడ్స్‌, ఇంటర్‌న్యూస్‌ సహకారంతో గూగుల్ దేశంలో ఉన్న జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పటికే 'గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్' పేరుతో దేశంలో ఉన్న జర్నలిస్టులకు గూగుల్ ప్రత్యేక వర్క్‌షాపుల్లో ట్రెయినింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది జూలై 20 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో గూగుల్‌ శిక్షణ తరగతులను నిర్వహించింది. 

త్వరలో పార్లమెంట్‌తోపాటూ, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్‌లో భాగంగా పోల్‌ చెక్‌.. కవరింగ్‌ ఇండియాస్‌ ఎలక్షన్‌ పేరుతో శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌, ఫ్యాక్ట్‌ చెకింగ్‌, డిజిటల్‌ సేఫ్టీ అండ్‌ సెక్యురిటీ, ఎన్నికల కవరేజీకి యూట్యూబ్‌ వాడే విధానం, డేటా విజువలైజేషన్‌వంటి అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గూగుల్‌ తెలిపింది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6వరకు 30 నగరాల్లో ఇంగ్లీష్, హిందీ, మలయాళం, బంగ్లా, కన్నడ, గుజరాతీ, ఒడిషా, తమిళం, తెలుగు, మరాఠీ భాషలకు చెందిన జర్నలిస్టులకు ట్రెయినింగ్ ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్నవారితో పాటూ జర్నలిజం విద్యార్థులు ఉచిత శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అందులో అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఉచితంగా ట్రెయినింగ్ ఇస్తారు. 

2016 నుంచి భారత్‌లో 40 నగరాల్లో 13,000 మందికిపైగా జర్నలిస్టులకు గూగుల్‌ శిక్షణనిచ్చిందని ఆసియా పసిఫిక్‌ గూగుల్‌ న్యూస్‌ ల్యాబ్‌ లీడ్‌ ఐరేన్‌ జే లియూ పేర్కొన్నారు. ఇక ట్రెయినింగ్ సమయంలో నకిలీ వార్తలు, సమాచారాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్‌లో మార్చి 13న‌, విశాఖపట్నంలో మార్చి 23న తెలుగు, ఇంగ్లీష్‌ బాషల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 

గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్‌లో భాగంగా పోల్‌ చెక్‌.. కవరింగ్‌ ఇండియాస్‌ ఎలక్షన్‌ శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు, ప్రదేశాల వివరాలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top