133 సీట్లలో ‘అటవి హక్కుల’ ప్రభావం

Forest Rights Could Decide Results In 2019 Lok Sabha Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్న 543 స్థానాల్లో 133 స్థానాల్లో ‘అటవి హక్కుల చట్టం’ అమలు తీరు ప్రభావితం చేయనుంది. 2014లో ఈ 133 స్థానాలకు జరిగిన ఎన్నికలను విశ్లేషించి ‘కమ్యూనిస్టు ఫారెస్ట్‌ రిసోర్స్‌–లర్నింగ్‌ అండ్‌ అడ్వకేసి (సీఎఫ్‌ఆర్‌–ఎల్‌ఏ)’ స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్నా ఈ నియోజక వర్గాల్లో అటవి భూమి చట్టం కింద భూములు రావాల్సిన ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తులకు వచ్చిన మెజారిటీ కన్నా ఈ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కనుక వీరు ఈసారి ఎన్నికల ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేయనున్నారు. ఈ చట్టం కింద భూమి హక్కులు లభించని వారందరిని అటవీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడం, దానిపై ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, దాంతో సుప్రీం కోర్టు తన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయడం తదితర పరిణామాలు తెల్సిందే. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అటవి హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేక పోవడం వల్ల ఆదివాసీలకు ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఈసారి ఏ రాజకీయ పార్టీ అయితే అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తామంటూ విశ్వసనీయంగా హామీ ఇవ్వగలతో ఆ పార్టీకి ఓటు వేసేందుకు ఈ ఆదివాసీ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని సీఎఫ్‌ఆర్‌–ఎల్‌ఏ తెలియజేసింది. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా ఈ విశయాన్ని సూచిస్తున్నాయని ఆ ఎన్జీవో సంస్థ తెలిపింది. అడవిలో నివసిస్తున్న ఆదివాసీలకు అటవిపై హక్కులు 2006లో లభించాయి. దీనివల్ల దేశంలోని దాదాపు 20 కోట్ల మందికి జీవనోపాధి లభించింది. వీరి సంఖ్య మొత్తం బ్రెజిల్‌ దేశ జనాభాతో సమానం. వారిలో 90 లక్షల మంది (45 శాతం) దళితులు ఉన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అటవి వాసులు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. మొత్తం దేశంలోని ఐదు లక్షల యాభైవేల హెక్టార్లపై (ఢిల్లీ రాష్ట్రమంత విస్తీర్ణం) వివాదాలు చెలరేగాయి. ఈ వివాదాల వల్ల 60 లక్షల మంది అటవి వాసులు ఇక్కట్ల పాలయ్యారని ‘లాండ్‌ కాన్ల్విక్ట్‌ వాచ్‌’ సంస్థ వెల్లడించింది.

ఈ ప్రాంతాల్లో 133 సీట్లకుగాను 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 59 శాతం సీట్లు రాగా, కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 4 శాతం సీట్లు మాత్రమే వచ్చాయి. 62 శాతం సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ ఎన్నికల సందర్భంగా అటవి హక్కుల చట్టాన్ని సమగ్రంగా అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొన్నదని స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

https://www.sakshi.com/national

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top