‘మరణ’యాతన తగ్గించలేమా?

Execution of death penalty is once again came to debatable

ఉరి ద్వారా మరణశిక్ష అమలు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ శిక్ష పడిన ఖైదీలు ప్రశాంతంగా మరణించాలే తప్ప బాధతో కాదని, ఒక మనిషిగా మరణంలోనూ గౌరవం పొందాల్సి ఉన్నందున ఈ విధానానికి ప్రత్యామ్నాయాలు కనుక్కోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఉరిశిక్ష ద్వారా ఖైదీలను అంతమొందించే పద్ధతిని ఎందుకు నిలుపుదల చేయకూడదంటూ శుక్రవారం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో పరిస్థితి ఏంటి.. దాని పూర్వాపరాలపై కథనం.  
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌   

అమెరికాలో ఐదు రకాల పద్ధతులు... 
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రాణాంతక ఇంజెక్షన్, విద్యుత్‌షాక్, గ్యాస్‌ ఛాంబర్, ఫైరింగ్‌ స్క్వాడ్, ఉరిశిక్షల ద్వారా మరణశిక్షలను అమలు చేస్తున్నారు. టెన్నెస్సీలో ఎలక్ట్రిక్‌ చైర్‌ను ఉపయోగిస్తుండగా, 35 రాష్ట్రాల్లో ఈ శిక్ష పడిన వారికి ఇంజెక్షన్‌ విధానాన్ని పాటిస్తున్నారు. 1977లో ఒక్లొహామాలో తొలిసారిగా ఈ ఇంజెక్షన్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా న్యూయార్క్‌ విద్యుత్‌ షాక్‌ విధానాన్ని ప్రవేశపెట్టి 1890లో మొదటిసారి అమలుచేసింది. నెవాడా 1920లలోనే గ్యాస్‌ఛాంబర్‌ ద్వారా మరణశిక్షను అమలుచేసింది. 

సంఖ్యపై కొరవడిన స్పష్టత... 
దేశానికి స్వాతంత్య్రం లభించాక ఇప్పటివరకు ఎంత మందికి ఉరిశిక్ష విధించారన్న సంఖ్యపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 52 మందిని ఉరితీసినట్లు చెబుతున్నా, తమ పరిశోధనలో దానికంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఈ శిక్షలు అమలయ్యాయని తేలిందని పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ సంస్థ చెబుతోంది. ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ తన పరిశోధనలో భాగంగా 755 మందిని ఉరితీశారంటూ పేర్కొంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో, ఏసీహెచ్‌ఆర్‌ గణాంకాల ప్రకారం 1995లో అత్యధికంగా 13 మంది, 1996, 97లలో ఒక్కొక్కరు చొప్పున, 1998లో ముగ్గురు, 2004లో «ఒకరు, 2012లో ముంబై ఉగ్రదాడిలో సజీవంగా పట్టుబడిన అజ్మల్‌ కసబ్, 2013లో పార్లమెంట్‌పై దాడి సూత్రధారి అçఫ్జల్‌గురు, 2015లో ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్‌ మెమన్‌లను ఉరితీశారు.

ప్రపంచవ్యాప్తంగా... 
వివిధ దేశాల్లో ఉరి, ఫైరింగ్‌ స్క్వాడ్‌తో కాల్పు లు, తుపాకీతో తల వెనక కాల్చడం, తల నరకడం, ప్రాణాంతక ఇంజెక్షన్, రాళ్లతో కొట్టి చంపడం, గ్యాస్‌ ఛాంబర్, విద్యుత్‌షాక్, ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు పడేయడం వంటి 9 పద్ధతులను అను సరిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ మొదలుకుని బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మలేసియా, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, యూఎస్‌ఏ లాంటి దాదాపు 60 దేశాల్లో ఉరిశిక్షకు చట్టబద్ధత ఉంది. మిలిటరీ కోర్టుల్లో శిక్ష పడ్డవారికి ఫైరింగ్‌ స్క్వాడ్‌లతో కాల్పులను అఫ్గానిస్తాన్, బహ్రెయిన్, క్యూబా, కువైట్, యూఏఈ, యూ ఎస్‌ఏ, వియత్నాం వంటి 28 దేశాలు, తుపాకీతో కాల్చిచంపే శిక్షలను 20 దేశాలు అమలుచేస్తున్నా యి. ఇండోనేసియా, ఇరాన్, మౌరిటానియా, నైజీరి యా, పాకిస్తాన్, సౌదీ ఆరేబియా, సూడాన్, యూఏఈ, యెమన్‌లలో రాళ్లతో కొట్టి మరణశిక్షను పాటిస్తున్నాయి. వ్యభిచారం, స్వలింగసంపర్క సం బంధాలు, అత్యాచారాలు వంటి కేసుల్లోనే దీనిని అమలు చేస్తున్నారు. ఇరాన్, సౌదీఅరేబియా, యెమన్‌లో తల నరకడం, చైనా, గ్వాటామాలా, తైవాన్, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌తో మరణ శిక్షను పాటిస్తున్నారు.

మరణశిక్ష రద్దుచేసిన దేశాలు.. 
అన్ని రకాల నేరాలకు కలుపుకుని మరణశిక్షను రద్దుచేసిన మొత్తం 104 దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, భూటాన్, కెనడా, కొలంబియా, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఇటలీ, మెక్సికో, నేపాల్, నెదర్‌లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పనామా, ఫిలిప్పిన్స్, పోలండ్, పోర్చుగల్, రొమోనియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటివి ఉన్నాయి. సాధారణ నేరాలకు ఈ శిక్షను బ్రెజిల్, చిలీ, కజకిస్తాన్, ఇజ్రాయెల్, పెరూ, ఎల్‌సాల్వడార్, గునియా రద్దుచేశాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top