
ఖాళీ కుర్చీల వెక్కిరింతతో వెనుదిరిగిన కేజ్రీవాల్
చండీగఢ్ : ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ర్యాలీకి జనం రాకపోవడం, ఖాళీ కుర్చీలు వెక్కిరించడంతో ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొక్కుబడిగా ప్రసంగించి వెనుదిరిగారు. హర్యానాలో మరో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉందంటూ అక్కడి నుంచి ఆయన బయటపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేజ్రీవాల్ ప్రసంగం ప్రారంభకావాల్సి ఉండగా జనం పలుచగా ఉండటంతో మరో గంట పాటు జాప్యం చేశారు. అప్పటికీ ప్రజలు పెద్దగా ర్యాలీ ప్రాంతానికి చేరకపోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి.
కాగా, కొద్దిసేపు ప్రసంగించిన కేజ్రీవాల్ స్ధానిక బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె అటు లోక్‌సభకు హాజరు కాకపోవడంతో పాటు ఇటు చండీగఢ్‌లోనూ ప్రజలకు ముఖం చూపించరని ఆరోపించారు. కిరణ్ ఖేర్‌ను మీరు ఎప్పుడైనా చండీగఢ్‌లో చూశారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆమె నటిగా ముంబైలో షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతారని చెప్పారు. నియోజకవర్గానికి ఆమె ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని విమర్శించారు.