
సాక్షి,న్యూఢిల్లీ: అగస్టా కేసులో దుబాయికి చెందిన రెండు కంపెనీల మహిళా డైరెక్టర్ దాఖలు చేసుకున్న బెయిల్ అప్పీల్‌ను ఈడీ వ్యతిరేకించింది. దుబాయి కంపెనీల డైరెక్టర్ శివానీ సక్సేనాకు బెయిల్ మంజూరు చేస్తే ప్రస్తుత విచారణకు విఘాతం కలుగుతుందని, దర్యాప్తుకు ఆమె సహకరించకుండా పారిపోయే అవకాశం ఉందని ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్‌కు ఈడీ నివేదించింది. శివానీ భర్త రాజీవ్ సహా ఈ కేసులో పలువురు నిందితులను ఇంకా అరెస్ట్ చేయని కారణంగా ఈ దశలో బెయిల్ మంజూరు తగదని వాదించింది.
విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, విచారణకు శివానీ సహకరించడం లేదని ఈడీ న్యాయవాది ఎన్‌కే మట్టా తెలిపారు. కేసులో చార్జిషీట్‌ను ఇప్పటికే సమర్పించిన దృష్ట్యా తనకు బెయిల్ మంజూరు చేసేందుకు ఎలాంటి అవరోధాలు లేవని శివానీ తన బెయిల్ దరఖాస్తులో పేర్కొన్నారు. రూ 3600 కోట్ల వీవీఐపీ చాపర్ కేసులో ఈడీ శివానీ సక్సేనా, ఆమె భర్త రాజీవ్ సహా పలువురు ఇతరులపై సెప్టెంబర్ 13న అభియోగాలు నమోదు చేసింది.