గవర్నర్ ఆదేశాలను పాటించకండి..
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య రగిలిన వివాదం చివరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరింది.
	న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య  రగిలిన వివాదం చివరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరింది. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ ఇవాళ ప్రణబ్ను కలవనున్నారు.  ప్రిన్సిపల్  సెక్రటరీగా రాజేంద్ర కుమార్ను నియమిస్తూ జారీ చేసిన కేజ్రీవాల్  ఆదేశాలను నజీబ్ జంగ్  తిరస్కరిస్తూ లేఖ రాశారు.   
	
	దీనికి స్పందించిన  ముఖ్యమంత్రి గవర్నర్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ  ప్రభుత్వ అధికారులను సోమవారం సాయంత్రం ఆదేశించారు.   లెఫ్టినెంట్ గవర్నర్,  లేదా ఆయన కార్యాలయం నుంచి గానీ  మౌఖికంగా గానీ, రాతపూర్వకంగా గానీ ఇచ్చే ఆదేశాలను,  ముందు సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, సంబంధింత ఇంచార్జ్ మంత్రులు,  ముఖ్యమంత్రికి సమర్పించాలన్నారు. దీంతో అగ్గి మరింత రాజుకుంది.  మరోవైపు తమ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా  ఎన్నికైందనీ, గత ప్రభుత్వాలు  లొంగిపోయినట్టుగా తాము  లొంగమని ఉపముఖ్యమంత్రి మనీష్   సిసొడియా స్పష్టం చేస్తున్నారు.
	
	కాగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శకుంతలా గామ్లిన్ను రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారుతూ వచ్చాయి.  శకుంతల నియామకాన్ని నిరసిస్తూ  సీనియర్ ఆఫీసర్ అనిందో మజుందార్ (ప్రిన్సిపల్ సెక్రటరీ  సర్వీసెస్)ఆఫీసుకు , ఆప్ ప్రభుత్వం సోమవారం ఉదయం తాళాలు వేసింది.  ఈ ఆఫీసు నుంచే శకుంతల నియామకానికి  సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయనీ, ప్రభుత్వాన్ని కాదని చీఫ్ సెక్రటరీని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని,  ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో  సీఎస్ నియామకం జరగాలని  ఆప్ వాదిస్తోంది.
	
	మరోవైపు విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా చేస్తున్నారంటూ ప్రభుత్వం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న శకుంతలా గామ్లిన్ ను ,  ముఖ్యమంత్రి వద్దని చెబుతున్నా సీఎస్ గా నియమించారని,  లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా సీఎస్ను నియమించడం తగదని కేజ్రీవాల్ సర్కారు ఆరోపిస్తోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
