ఢిల్లీ ఛోడ్‌ దో : మోదీకి వాజ్‌పేయి ఆదేశం

Dilli Chhod Do: When Vajpayee Asked Narendra Modi To Leave Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భరత మాత ముద్దుబిడ్డ, బీజేపీ పెద్ద దిక్కు అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) దివికెగిశారు. వాజ్‌పేయి ఇక లేరని వార్తను యావత్‌ భారత్‌ దేశం తట్టుకోలేకపోతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే అటల్‌జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్‌పేయి లేకపోవడం ఒక యుగాంతంలా ఉంది అని కన్నీరు పెట్టుకున్నారు. వాజ్‌పేయికి, ప్రధాని నరేంద్ర మోదీ అవినాభావ సంబంధం ఉంది. మోదీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వాజ్‌పేయితో మంచి సంబంధాలు కొనసాగేవి. 

1995, 1998లలో జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా మోదీ పోషించిన పాత్రను వాజ్‌పేయి ఎంతో అభినందించారు. 1998 ఎన్నికల సమయంలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలన్నీ మోదీనే తన భుజంపై వేసుకున్నారు. ఆ సమయంలోనే గుజరాత్‌కు కూడా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో మోదీ ఢిల్లీలోనే ఉన్నారు. కానీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. 1995, 1998 ఎన్నికల్లో మోదీ వ్యూహాల రూపకల్పనపై వాజ్‌పేయి ఎంతో ఇంప్రెస్‌ అయ్యారట. ఆ తర్వాత రెండు మూడేళ్లకు గుజరాత్‌ ముఖ్యమంత్రి కేశుభాయ్‌ పటేల్‌ ఆరోగ్యం క్షీణించడం, అడ్మినిస్ట్రేషన్‌ కుదుపులకు లోనుకావడం జరిగింది. ఇక 2001 రిపబ్లిక్‌ డే రోజునే గుజరాత్‌ను పెను భూకంపం కబళించింది. ఈ పర్యావరణ విపత్తులో 15వేల మంది నుంచి 20 వేల మంది వరకు మరణించారు. 

ఆ సమయంలో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాజ్‌పేయి నుంచి మోదీకి పిలుపు అందింది. వెంటనే వచ్చిన 7 రేస్‌ కోర్స్‌ రోడ్డు(ప్రస్తుతం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌)లో ఉన్న తన అధికారిక నివాసంలో తనను కలవాల్సిందిగా వాజ్‌పేయి మోదీని ఆదేశించారు. వాజ్‌పేయి ఆదేశాల మేరకు, మోదీ వెళ్లి ఆయన్ను కలిశారు. ‘వెంటనే నీవు ఢిల్లీ వదిలి వెళ్లాలి. ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే’ అన్నారట. వాజ్‌పేయి మాటలకు ఏమైందోనని తీవ్ర షాకింగ్‌కు గురైన మోదీ, ఎక్కడికి వెళ్లాలి అని అడిగారట?  కేవలం ఒక్క పదంలోనే వాజ్‌పేయి సమాధానం కూడా చెప్పారు. గుజరాత్‌ అని. 

కొన్ని రోజుల అనంతరం 2001 అక్టోబర్‌ 7న కేశుభాయ్‌ పటేల్‌ స్థానంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నాలుగు నెలలకు అంటే 2002 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి గోద్రా రైలులో వస్తున్న కర్‌ సేవకులకు, దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది దుర్మరణం పాలయ్యారు.  ఈ ఘటన తదనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున్న మతహింస కాండ జరిగింది. ఆ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులూ మరణించినట్టు తెలిసింది. కానీ వాస్తవానికి 2,000 కు పైగా మరణించి ఉంటారని అంచనా. ఈ అల్లర్ల సమయంలో మోదీకి, వాజ్‌పేయి ఒక్కటే సూచించారట. ఎట్టిపరిస్థితుల్లో ‘రాజధర్మా’న్ని వదలొద్దని. రాజధర్మం అంటే అధికారంలో ఉన్న వాళ్లు ఎగువ, దిగువ కులాల మధ్య వ్యత్యాసం చూపరాదని సమాజంలోని అన్ని మతాల ప్రజల పట్ల సమాదరణ కలిగి ఉండాలని స్పష్టంచేశారట. ఈ అల్లర్లు మోదీ ఇమేజ్‌ను ఏ మాత్రం దెబ్బతీయలేదు.  2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ.. సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి, మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు. 2007, ​2012 ఎన్నికల్లో గుజరాత్‌లో మోదీనే ఘన విజయం సాధించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ వేవ్‌, 2014 గుజరాత్‌ ఎన్నికల్లో కూడా సఫలమై, ఎన్డీయే తరుఫున భారత్‌ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top