
నిర్మాణ రంగంలో వలస కూలీలకు ఉపాథి కల్పించేందుకు నరెడ్కో హామీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో స్వస్ధలాలకు చేరిన వలస కూలీల ఉపాథిపై ఆందోళన వ్యక్తమవుతోంది. యూపీకి తరలివచ్చిన వలస కూలీల్లో 2.5 లక్షల మంది కార్మికులకు ఉపాథి కల్పించేందుకు జాతీయ రియల్‌ఎస్టేట్ అభివృద్ధి మండలి (నరెడ్కో) ముందుకొచ్చింది. నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు సహకరిస్తే వలస కూలీలకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు నరెడ్కో లేఖ రాసింది.
ఉపాథి కోల్పోయిన వలస కూలీలకు ఆదాయం లేక, రోజువారీ అవసరాలు నెరవేర్చుకోలేక పోతున్నారని నరెడ్కో చీఫ్ ఆర్‌కే ఆరోరా ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వం లేదా రియల్‌ఎస్టేట్ డెవలపర్ల సంఘం వద్ద తమ పేర్లు నమోదుచేయించుకుంటే వారికి ఉపాథి లభించేలా చర్యలు చేపడతామని అరోరా పేర్కొన్నారు. వీరందరికీ రేషన్, వసతితో పాటు మౌలిక సదుపాయాలను రియల్‌ఎస్టేట్ డెవలపర్లు సమకూరుస్తారని వెల్లడించారు.