నాడు సమాధి.. నేడు శివాలయం

In Delhi Tomb Became Temple And Deputy CM O rdered To Give Full Details - Sakshi

న్యూఢిల్లీ : కుతుబ్‌ షా కాలం నాటి గుర్తు తెలియని వ్యక్తి సమాధి అది. ఒకప్పుడు ఊరి చివర ఉన్న ఆ సమాధి కాస్తా జనాభా పెరిగే కొద్ది ప్రస్తుతం ఊరు మధ్యలోకి వచ్చింది. రాజుల కాలం నాటి ఈ సమాధిని తమ అధీనంలోకి తీసుకుని పరిశీలించాలని పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నించారు, అందుకు స్థానికులు ఒప్పుకోలేదు. కానీ ఆశ్చర్యంగా కొన్ని నెలల్లోనే ఆ సమాధిని కాస్తా ఆలయంగా మార్చి పూజ, పునస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఎనక్లేవ్‌ ప్రాంతంలో ఉన్న హుమాయున్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

కుతుబ్‌ షా కాలం నాటి గుర్తు తెలియని వ్యక్తి సమాధి కాస్తా ఇప్పుడు ‘శివ్‌ భోలా’ ఆలయం అయ్యింది. దీని గురించి స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కళలు, సాంస్కృతిక, భాషా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆదేశించారు. దీనిపై సిసోడియా స్పందిస్తూ.. ‘ఈ సంఘటన గురించి నాకు ఎటువంటి సమాచారం తెలియదు. ఒక చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయడం, దానికి హాని కల్గించడం రెండు నేరమే. ఇందుకు కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది. పురావస్తు శాఖ అధ్వర్యంలో ఉన్న చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ శాఖదే. చారిత్రక కట్టడాలకు ఎవరైనా హాని కల్గిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా పురావస్తు శాఖ అధికారులకు ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు పూర్తి వివరాలు ఇవ్వాలని పురావస్తు శాఖ వారిని ఆదేశించిడం జరిగింది. దీనికి బాధ్యులేవరైనా కఠిన శిక్ష తప్పద’ని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top