హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలనా వ్యవస్థ: దిగ్విజయ్ సింగ్ | Delhi Rule in Combined Capital Hyderabad, says Digvijay Singh | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘ఢిల్లీ’ పాలన: దిగ్విజయ్

Aug 5 2013 3:42 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలనా వ్యవస్థ: దిగ్విజయ్ సింగ్ - Sakshi

హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలనా వ్యవస్థ: దిగ్విజయ్ సింగ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశముందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశముందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఆ ప్రకారం నగరంలో శాంతిభద్రతల అంశాన్ని నేరుగా కేంద్రమే పర్యవేక్షిస్తుందన్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కే జవాబుదారీగా ఉంటారని గుర్తు చేశారు. అదే తరహా విధానంపై తాము దృష్టి సారించినట్టు సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ డెవిల్స్ అడ్వొకేట్ కార్యక్రమంలో కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. పదేళ్లపాటు హైద్రాబాద్ పోలీస్ వ్యవస్థ లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా, హైదరాబాద్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఒకరే బాధ్యతలు నిర్వర్తించవచ్చునని చెప్పారు.
 
ఈ పదేళ్ల పాటు హైదరాబాద్ తెలంగాణలో భాగంగా ఉంటుందా, లేదా కేంద్రపాలిత ప్రాంతంగానా అని కరణ్ ప్రశ్నించగా, ‘‘పదేళ్ల తర్వాత నగరాన్ని తెలంగాణలో భాగం చేస్తామని సీడబ్ల్యూసీ తీర్మానం వాగ్దానం చేసింది. ఆంధ్రా ప్రాంతానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని దిగ్విజయ్ వివరించారు. తెలంగాణపై నిర్ణయంతో దేశంలో పలు ప్రాంతాల్లో కొత్త రాష్ట్రాల డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కొత్త ఎస్సార్సీ వేసేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉందా? అని ప్రశ్నించగా, దాన్ని వేయాలంటూ 2002లో పార్టీ చేసిన తీర్మానం ఇంకా ఉనికిలోనే ఉందని చెప్పారు. అందుకు కేంద్రం అంగీకరిస్తుందో లేదో తనకు తెలియదన్నారు. తెలంగాణపై విసృ్తత ఏకాభిప్రాయం లేదని, అయినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు సాధించేందుకే విభజనకు నిర్ణయం తీసుకుందని జరుగుతున్న వాదనను తోసిపుచ్చారు. అది పూర్తిగా తప్పని, తెలంగాణ ఏర్పాటు నిర్ణయం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నది కాదని అన్నారు.
 
‘‘తెలంగాణ గురించి మనం 1950ల నుంచీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. పైగా కొత్త రాష్ట్ర ఏర్పాటుపై అన్ని వర్గాల రాజకీయ నాయకులు, రాష్ట్ర నేతలతో వీలైనంత విసృ్తతంగా సంప్రదింపులు జరిపాం. పైగా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండుసార్లు తీర్మానాలు కూడా చేసింది’’ అని చెప్పుకొచ్చారు. విభజనను వ్యతిరేకిస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాలను ప్రస్తావించగా ఈ పరిణామాలపై తమకు సమాచారం ఉందన్నారు. చారిత్రకంగా తాము చేసిన వాగ్దానాలను నిలుపుకున్నట్టు చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానానికి పడిపోతుందన్న ఇటీవలి ఒపీనియన్ పోల్స్ ఫలితాలను దిగ్విజయ్ తోసిపుచ్చారు. ఇక ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ తమకు ఒక సమస్యే కాదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement