మా బతుకులు దేశం కోసమే, కానీ...

Deceased Rifleman Aurangzeb Father Burst Again - Sakshi

శ్రీనగర్‌: ఓవైపు దేశం మొత్తం రంజాన్‌ సంబరాల్లో మునిగి తేలుతుంటే.. ఫూంచ్‌(జమ్ము కశ్మీర్‌)లో మహ్మద్‌ హనీఫ్‌ కుటుంబం మాత్రం శోకసంద్రంలో కూరుకుపోయింది. కన్నకొడుకు ఔరంగజేబ్‌ ఉగ్రవాదుల చేతిలో దారుణంగా హత్యకు గురికావటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్టెడు దుఖంలోనూ.. ఉగ్రచర్యలను ఉపేక్షిస్తూ కూర్చోవటం సరికాదని ఆయన భారత సైన్యానికి సూచిస్తున్నారు. 

‘కశ్మీర్‌లో కొందరు పాక్‌ జెండాలు ఎందుకు అవనతం చేస్తున్నారు? భారత జెండాలు ఎందుకు కనిపించటం లేదు?.. పరిస్థితులు ఎందుకింత దారుణంగా తయారయ్యాయి. నా కొడుకు దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. ఇప్పుడు నేను, నా మిగతా కొడుకులం కూడా ఈ గడ్డ తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఓ ఆర్మీ అధికారి వద్ద హనీఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘విధి నిర్వహణలో ప్రాణాలైన అర్పిస్తానని ప్రతీ జవాన్‌ ప్రమాణం చేస్తారు. నా కొడుకు ఆ ప్రామిస్‌ను నిలుపుకున్నాడు. ప్రాణ త్యాగంతో విగత జీవిగా నా వద్దకు చేరాడు. సైన్యం అంటేనే దేశం కోసం ప్రాణాలివ్వటం. ఏదో రోజూ ప్రాణాలు పోతాయన్నది నాకూ తెలుసు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు విడిచారు. కానీ, ఇది చూసి మిగతా వాళ్లు.. వాళ్ల వాళ్ల పిల్లలను పంపటం ఆపేస్తే ఏంటి గతి? సైనికులుగా ఎవరు మారతారు? దేశం తరపున ఎవరు పోరాడతారు? దుందుడుకు నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అవసరమైతే మళ్లీ పోరాటంలోకి నేను దిగుతా. నా కుటుంబం, మా బతుకులు దేశానికే అంకితం చేస్తాం. కానీ, మన ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మిలిటెంట్లను ఏరిపడేయాలి. జై హింద్‌’ అని హనీఫ్‌ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. 
 
ఆర్మీ మాజీ ఉద్యోగి అయిన హనీఫ్‌ నాలుగో తనయుడు ఔరంగజేబ్‌. సోఫియాన్‌లోని షాదిమార్గ్‌ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్‌ 44 దళంలో రైఫిల్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్‌ సెలవుపై ఇంటికి వెళ్తున్న సమయంలో  గురువారం ఉగ్రవాదులు అపహరించి మరీ కిరాతకంగా హత్య చేశారు. శుక్రవారం ఉదయం బుల్లెట్లతో చిధ్రమైన అతని మృతదేహాన్ని సైన్యం స్వాధీనపరుచుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శనివారం ఔరంగజేబ్‌ అంత్యక్రియలు నిర్వహించగా.. వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ వీర జవాన్‌కు నివాళులర్పించారు.

  

ఇంకా 32 గంటలే... కాగా, తన కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హనీఫ్‌.. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి 72 గంటల డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. ‘నా కొడుకు మరణంపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతున్నా. ఈ గడ్డపై పుట్టిన బిడ్డను చంపి 40గంటలు దాటింది. మరో 32 గంటలే మిగిలి ఉంది. ఆలోగా వాళ్లను చంపకపోతే.. ప్రతీకార చర్యకు మేమే రంగంలోకి దిగుతాం’... అని ఔరంగజేబ్‌ తండ్రి హనీఫ్‌ తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ నేతలపైనా, వేర్పాటువాదులపైనా ఆయన మండిపడ్డారు.

ఔరంగజేబ్‌ ఫోటో, వీడియోలు.. గురువారం ఉదయం ఔరంగజేబ్‌ను అపహరించాక ఉగ్రవాదులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top