
మైసూర్ : నగరానికి చెందిన కార్పొరేటర్ ఎంఎస్ బాలసుబ్రమణియమ్ సరికొత్త రికార్డు సృష్టించారు. కానీ, ఆయన పేరు అలా చెబితే ఎవరూ గుర్తుపట్టరు. స్నేక్ శ్యామ్‌గానే నగరంలో ఆయన పాపులర్‌లేండి. ఆయన ప్రత్యేకత.. పాములు పట్టడంలో సిద్ధహస్తుడు. తాజాగా అత్యధిక పాములను పట్టుకున్న ఘనత ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.
1997 నుంచి శ్యామ్ ఈ పని ప్రారంభించగా... ఈ మధ్యే 33,000 వేల పాములను పట్టుకుని ఆయన రికార్డు సృష్టించారు. చాముండేశ్వరీ రైల్వే లేఅవుట్‌లోని జయబాయి నిలయంలో దూరిన ఓ భారీ త్రాచుపామును పట్టడం ద్వారా ఆయన ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. పాము కనిపించిందన్న వార్త కనిపిస్తే చాలు ఠక్కున వచ్చి వాలిపోతారు. ఆయనను చూడగానే ఏదో హిప్నాటిజం జరిగినట్లు పాములు కూడా కదలకుండా ఉండిపోతాయి. త్రాచు, నాగు పాములు, కొండ చిలువలు... అలా ఎంతటి ప్రమాదకరమైన పామునైనా సరే చాకచక్యంగా పట్టుకుని సంచిలో వేసుకుని వెళ్లిపోయి.. అడవిలో వదిలేస్తారు. ఆయన పామును పడితే అది మళ్లీ ఆవైపు రాదనేది స్థానికుల నమ్మకం.
ప్రకృతి ప్రేమికుడిగా సహజ పద్ధతులను అనుసరించే ఆయనంటే అక్కడి ప్రజలకు ప్రత్యేక అభిమానం. అందుకే మైసూర్ కౌన్సిల్‌కు 13వ వార్డు తరపున ఆయనను కార్పొరేటర్‌గా గెలిపించారు. ఓవైపు కార్పొరేటర్‌గా ఉంటూనే పాములు పడుతున్న ఆయన.. ఇక ముందు కూడా ఆ పని చేస్తానని గర్వంగా చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్‌లో ఆయనపై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారం అయ్యింది కూడా.