దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన పళని సర్కార్ పనిలోపనిగా కేంద్రానికి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది.
‘ఎన్‌డీఏ కూటమిలోకి ఏఐఏడీఎంకే’
Sep 18 2017 6:09 PM | Updated on Sep 19 2017 4:44 PM
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన పళని సర్కార్ పనిలోపనిగా కేంద్రానికి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌లో ఏఐఏడీఎంకే భాగస్వామి అవుతుందని తమిళనాడు సీఎం పళనిస్వామి సంకేతాలు పంపారు.కేంద్రంలోని పాలక కూటమిలో చేరితే తమిళనాడు కోసం ఏఐఏడీఎంకే ప్రభుత్వం మరెంతో చేయగలిగేదని పళనిస్వామి వ్యాఖ్యానించారు. కేంద్రం సహకారంతో పలు నూతన పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవారమని, తమిళనాడును అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దుకునేవారమని అన్నారు. రాష్ట్రంలో సంపద వెల్లివిరిసేలా చర్యలు చేపట్టేవారమని చెప్పుకొచ్చారు.
ఏఐఏడీఎంకేకు ఆ అవకాశం లేకున్నా రాష్ట్రనికి ప్రాజెక్టులు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నమక్కల్‌లో జరిగిన ఎంజీఆర్ స్వర్ణోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసింగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ముందు మోకరిల్లిందన్న డీఎంకే విమర్శలను పళనిస్వామి తోసిపుచ్చారు. తాము కేంద్రానికి తొత్తులం కాదు సేవకులం కాదని, కేంద్రంతో కేవలం సామరస్య సంబంధాలనే నెరుపుతున్నామని స్పష్టం చేశారు.
కేంద్రంతో మెరుగైన సంబంధాలుంటేనే రాష్ట్ర ప్రాజెక్టును సాధించుకోవడంతో పాటు సంక్షేమ పథకాలకు అనుమతులు తెచ్చుకోగలుగుతామని చెప్పారు.తమిళనాడుకు పెద్దసంఖ్యలో పేదలకు గృహాలను కేంద్రం మంజూరు చేసిందని,రాష్ట్రానికి ఇండస్ర్టియల్ టౌన్‌షిప్‌ను మంజూరు చేసిందని వివరించారు.
Advertisement
Advertisement