నగరానికి ప్రత్యేకంగా ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో)ను నియమించాలని చూడటం సబబు కాదని శివసేన విమర్శించింది.
ముంబై: నగరానికి ప్రత్యేకంగా ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో)ను నియమించాలని చూడటం సబబు కాదని శివసేన విమర్శించింది. ముంబై అభివృద్ధికి సీఈవోను నియమించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆలోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో శివసేన పైవిధంగా స్పందించింది. నగరానికి సీఈవోను ఏర్పాటుచేయడమంటే రాష్ట్రం నుంచి దాన్ని వేరుచేసినట్లే లెక్క.. అని ఆ పార్టీ అభిప్రాయపడింది.
ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ ఎంపీ రాహుల్ షావలే తెలిపారు. నగరాభివృద్ధి శాఖ ద్వారా ముంబైని అభివృద్ధి చేసే విషయంలో సీఎంకు విశ్వాసం లేకనే ఈ విధంగా ఆలోచిస్తున్నారని ఆయన విమర్శించారు. నగరానికి రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో సమాన హోదా ఉన్న మున్సిపల్ కమిషనర్ ఉన్నారని, ఆయనతో నగరాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకోవచ్చని సూచించారు.
కాగా, శివసేన వ్యాఖ్యలను నగర బీజేపీ అధ్యక్షుడు అశిష్ శేలర్ ఖండించారు. ‘ శివసేన నగరానికి సీఈవో ఏర్పాటును అడ్డుకుంటే నగరాభివృద్ధిని అడ్డుకుంటున్నట్లేనని తాము భావించాల్సి ఉంటుందన్నారు. కాగా, నగరంలో పలు సంస్థల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను సమన్వయపరిచేందుకు అదనపు చీఫ్ సెక్రటరీతో సమాన హోదా కలిగిన సీఈవోను నియమించేందుకు యోచిస్తున్నట్లు సీఎం ఫడ్నవిస్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.