
న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంలో భాగంగా అంతర్జాతీయ సరిహద్దులు గల తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 167 కోట్లను విడుదలచేసింది. అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రలు పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్, అస్సోం రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగి ఉన్నాయి. వాటిని బలోపేతం చేసేందుకు అధిక నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. బార‍్డర్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్( బీఏడీపీ)లో భాగంగా ఈ నిధులను విడుదలచేసినట్టు తెలిపారు.
మేఘాలయా, పంజాబ్, రాజాస్థాన్, బిహార్, సిక్కిం, త్రిపుర, అస్సోం, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నిధులను ఖర్చుచేయనున్నారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కి.మీ పరిధిలో ఉన్న 17 రాష్ట్రాలలో బీఏడీపీ పథకం అమలవుతుంది. సరిహద్దుల్లోని వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం, క్రీడారంగం అభివృద్ధి, బోర్డర్ టూరిజ్ డెవలప్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంటులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను ఖర్చుచేయనుంది.