కేంద్రమే కేసులతో బెదిరిస్తోంది

Cases are being put on us if we disclose information - Sakshi

సమాచారం బయటపెట్టమంటే మాపై కేసులు పెడుతున్నారు

కేంద్ర సమాచార మాజీ  కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులు  సంచలన ఆరోపణలు 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగమైన సమాచార కమిషన్‌పై ఆ కేంద్రమే స్వయంగా కోర్టుల్లో కేసులు వేసి బెదిరిస్తోందని ఇటీవలే సమాచార కమిషనర్‌ పదవి నుంచి విరమణ పొందిన మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు ఆరోపించారు. సమాచారం బయటకు రాకుండా అడ్డుకునేందుకు, సమాచార కమిషన్, కమిషనర్లను కేసులతో భయపెట్టేందుకే కేంద్రం ఇలా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేత దారుల వివరాలు బయటపెట్టాలంటూ ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)ను శ్రీధర్‌ ఆచార్యులు ఆదేశించడం, అనంతరం ఈ విషయంలో ప్రధాన సమాచార కమిషనర్‌ ఆర్కే మాథుర్‌తో ఆయనకు విభేదాలు తలెత్తడం తెలిసిందే. ‘ఇక్కడ కేంద్రం లక్ష్యం సీఐసీ (కేంద్ర సమాచార కమిషన్‌), భారత పౌరులే. ఈ కేసులను గెలవడం కేంద్రం ఉద్దేశం కాదు. సీఐసీ కమిషనర్లను భయపెట్టడమే వారికి కావాలి’ అని శ్రీధర్‌ ఆరోపించారు. రుణ ఎగవేతదారుల వివరాలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు కూడా గతంలోనే ఆర్‌బీఐని ఆదేశించిందనీ, అయినా సమాచారం బయటకు రాకపోవడంతో తాను మరోసారి ఆదేశాలు జారీ చేశానని ఆయన తెలిపారు. అయితే ఆర్‌బీఐ తనపై బాంబే హైకోర్టులో కేసు వేసిందని పేర్కొన్నారు. 

ఒక్క కేసులో మూడు నోటీసులు 
ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా గుజరాత్‌ విశ్వవిద్యాలయాన్ని తాను ఆదేశిస్తే గుజరాత్‌ హైకోర్టులో యూనివర్సిటీ ఆ ఆదేశాలను సవాల్‌ చేసిందని శ్రీధర్‌ ఆచార్యులు తెలిపారు. ఆ కేసులో తనను సమాచార కమిషనర్‌గా, సీఐసీ ప్రతినిధిగా, వ్యక్తిగతంగా.. మూడు హోదాల్లో ప్రతివాదిగా చేర్చారనీ, ఒక్క కేసులో మూడు నోటీసులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కేసులో కేంద్రం తరఫున వాదించేదుకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చారనీ, మరి సీఐసీ కమిషనర్‌ అయిన తాను కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమే కానీ తన తరఫున మాత్రం ఏఎస్‌జీ వాదించలేదని శ్రీధర్‌ ఆచార్యులు వెల్లడించారు. సీఐసీ, సమాచార కమిషనర్లపై ప్రస్తుతం 1,700 కేసులు కోర్టుల్లో ఉండగా వాటిలో అత్యధిక శాతం కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేసినవేనని ఆయన వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top