‘అదంతా మాజీ ఎంపీ పనే... పోలీసుల ఎదుటే జరిగింది’ | UP Businessman Alleged He Was Forced To Sign Property Papers In Jail | Sakshi
Sakshi News home page

‘ఆ మాజీ ఎంపీ నా ఆస్తి మొత్తం రాయించుకున్నాడు’

Dec 31 2018 9:20 AM | Updated on Jul 11 2019 8:38 PM

UP Businessman Alleged He Was Forced To Sign Property Papers In Jail - Sakshi

పోలీసుల ఎదుటే ఈ తతంగమంతా జరిగింది.

లక్నో : తనను బెదిరించి ఓ మాజీ ఎంపీ తన ఆస్తి మొత్తం రాయించుకున్నాడని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి మోహిత్‌ జైస్వాల్‌ ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా పోలీసుల ఎదుటే ఈ తతంగమంతా జరిగిందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివరాలు... మోహిత్‌ జైస్వాల్‌ అనే వ్యాపారవేత్త డిసెంబరు 26న కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చి.. వ్యాపారం గురించి మాట్లాడాలని చెప్పి.. ఆ తర్వాత తన కారులోనే కిడ్నాప్‌ చేశారని పేర్కొన్నాడు. లక్నో నుంచి దాదాపు 316 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోరియా జైలుకు తీసుకుని వెళ్లారని తెలిపాడు. ఆ తర్వాత జైలు కాంప్లెక్స్‌లో... సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అతీఖ్‌ అహ్మద్‌తో మాట్లాడాల్సిందిగా తనకు సూచించారన్నాడు. అయితే ఆ సమయంలో జైలు సిబ్బంది మొత్తం అక్కడే ఉన్నారని... అయినప్పటికీ అతీఖ్‌ అహ్మద్‌, ఆయన కొడుకులు దాడి చేసి బలవంతంగా తన ఆస్తి మొత్తం వారి పేరిట రాయించుకున్నారని ఆరోపించాడు.

కాగా మోహిత్‌ జైస్వాల్‌ అనే వ్యక్తి జైలు కాంప్లెక్స్‌ లోపలికి వచ్చిన మాట వాస్తమేనని జైలు సిబ్బంది తెలిపారు. అయితే అతడు కిడ్నాప్‌ అయినట్టుగానీ, వారి మధ్య జరిగిన ఘర్షణ గురించి గానీ తమకు తెలియదని పేర్కొన్నారు. ఈ క్రమంలో మోహిత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, మీడియాతో గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా యోగి ప్రభుత్వం డియోరియా జైలు ప్రధాన అధికారిని ఆదేశించింది. కాగా ఓ కేసులో అరెస్టైన మాజీ ఎంపీ అతీఖ్‌ అహ్మద్‌ ప్రస్తుతం డియోరియా జైలులో ఉన్నారు. గతంలో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం 70 కేసుల్లో అతీఖ్‌కు, ఆయన అనుచరులకు సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement