ఏడాదిలో లక్ష కోట్ల నల్లధనం! | Black money: Over Rs 1 lakh crore illegal income detected | Sakshi
Sakshi News home page

ఏడాదిలో లక్ష కోట్ల నల్లధనం!

Jul 17 2014 2:11 AM | Updated on Apr 3 2019 5:16 PM

ఏడాదిలో లక్ష కోట్ల నల్లధనం! - Sakshi

ఏడాదిలో లక్ష కోట్ల నల్లధనం!

దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన తనిఖీలు, దాడుల్లో ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ బుధవారం వెల్లడించింది.

దాడులు, తనిఖీల్లో గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ
బయటపడిన అక్రమ స్థిర, చరాస్తుల విలువ రూ. 1,01,181 కోట్లు
5,327 మంది వ్యక్తులు, సంస్థలపై దాడులు

 
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన తనిఖీలు, దాడుల్లో ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ బుధవారం వెల్లడించింది. ఇది గత ఏడాది కంటే రెండున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో వెల్లడించకుండా దాచిన ఆస్తుల్లో ఏకంగా రూ. 71,195 కోట్లు ఒకే కార్పొరేట్ గ్రూప్‌నకు చెందినవి కావడం విశేషం. ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అక్రమాస్తులున్నాయనే సమాచారం మేరకు వివిధ వ్యక్తులు, వారి సంస్థల మీద చేసిన దాడుల్లో రూ. 10,791 కోట్ల ‘వెల్లడించని ఆస్తుల’ను గుర్తించారు. ఇదే సమయంలో పలు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ. 90,390 కోట్ల ‘లెక్కల్లో చూపని ఆస్తుల’ను గుర్తించారు. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1,01,181 కోట్ల నల్లధనాన్ని గుర్తించారు.

ఇది అంతకుముందటి 2012-13 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన రూ. 29,628 కోట్లకన్నా మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. గత ఏడాది గుర్తించిన లక్ష కోట్ల నల్లధనానికి తోడు రూ. 807 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా సీజ్ చేశారు. 5,327 మంది వ్యక్తులు, సంస్థలపై దాడులు చేసి.. 4,503 వారంట్లను జారీ చేశారు. కాగా మునుపటితో పోలిస్తే గత రెండేళ్లుగా ఆదాయపన్ను శాఖ ఎక్కువ దాడులు, తనిఖీలు నిర్వహించిందని... అక్రమార్కుల పట్ల మరింత అప్రమత్తంగా తమ శాఖ వ్యవహరిస్తోందనే దానికి ఇది సూచన అని ఐటీ శాఖ అధికారి ఒకరు చెప్పారు. తాము గుర్తించిన నల్లధనం వివరాలను సిట్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వంటి సంస్థలకు అందజేశామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement