రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016ను విపక్షాల తీవ్ర నిరసనల మధ్య మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
* రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా..
* బిల్లు ప్రతులు ఇవ్వలేదని విపక్షాల నిరసన
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016ను విపక్షాల తీవ్ర నిరసనల మధ్య మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సంప్రదాయం ప్రకారం తమకు ముందస్తుగా బిల్లు ప్రతులను ఇవ్వనందున బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించవద్దని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ను కోరారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై భారీ జరిమానాలను ప్రతిపాదిస్తూ తెచ్చిన ఈ బిల్లును ఇటీవల కేబినెట్ ఆమోదించడం తెలిసిందే. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కారీ సభలో బిల్లును ప్రవేశపెడుతూ...
కీలకమైన ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరగా, దీన్ని సంయుక్త ఎంపిక కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వచ్చే శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నందున ఆలోపే రాజ్యసభలోనూ ఆమోదం పొందేందుకు అవకాశముంటుదని గడ్కారీ చెప్పారు. కాగా పారిశ్రామిక ప్రమాదాల్లో ఉద్యోగులు గాయపడితే వారికిచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతూ తెచ్చిన ఉద్యోగుల పరిహార (సవరణ) బిల్లు-2016కు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉద్యోగులకు రూ.50 వేల నుంచి లక్ష వరకు పరిహారం అందుతుంది. కంపెనీలు నిబంధలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా వేస్తారు.
కశ్మీర్‌పై నేడు చర్చ.. కశ్మీర్‌లో ఉద్రిక్తతపై రాజ్యసభలో చర్చ నిర్వహించాలని విపక్షాలన్నీ ఏకమై చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గింది. కశ్మీర్‌పై బుధవారం చర్చ జరుపుతామని హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. దళితులపై జరుగుతున్న దాడుల అంశంపై చర్చకూ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై గురువారం లోక్‌సభలో చర్చిస్తారు.