తన నియోజకవర్గంలో జాతీయ రహదారి నిర్మాణంలో ప్రభుత్వ అలసత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారి వినూత్న నిరసన తెలిపారు.
పట్నా: ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రతిపక్ష నాయకలు రకరకాలుగా నిరసన తెలుపుతుంటారు. ధర్నాలు, నిరహారదీక్షలతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటారు. మరి కొంతమంది నేతలు విచిత్ర వేషధారణలతో వినూత్నంగా నిరసనలు చేస్తుంటారు. బిహార్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారి కూడా ఇదే కోవకు చెందిన నాయకుడు. తన నియోజకవర్గం లారియా యోగపట్టిలో జాతీయ రహదారి నిర్మాణంలో ప్రభుత్వ అలసత్వానికి వ్యతిరేకంగా ఆయన వినూత్న నిరసన తెలిపారు. బనియన్, నిక్కరు మాత్రమే ధరించి అసెంబ్లీకి వచ్చారు. భద్రతా సిబ్బంది ఆయనను అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్నారు. జాతిపిత మహాత్మ గాంధీ స్ఫూర్తితో నిరసన తెల్పుతున్నట్టు ఆయన వెల్లడించారు.
‘మానుయపాల్ నుంచి రత్వాల్ వరకు జాతీయ రహదారి నిర్మిస్తామని సీఎం నితీశ్ కుమార్ హామీయిచ్చారు. ఇప్పటివరకు దీని గురించి పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఆయనకు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారు. సీఎం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. నేను గాంధీయవాదిని. నా కుర్తాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, పైజామాను నితీశ్ కుమార్ కు త్యాగం చేస్తున్నాను. నా ఆలోచనలను మీ ముందు ఉంచుతున్నాను. నాతో ఎవరు కలిసివచ్చినా స్వాగతిస్తాన’ని తన ఫేస్ బుక్ పేజీలో వినయ్ బిహారి పేర్కొన్నారు.