ఇది అప్పటి భారత్‌ కాదు | Arun Jaitley Hits Back at China | Sakshi
Sakshi News home page

ఇది అప్పటి భారత్‌ కాదు

Jul 1 2017 1:17 AM | Updated on Aug 20 2018 5:17 PM

ఇది అప్పటి భారత్‌ కాదు - Sakshi

ఇది అప్పటి భారత్‌ కాదు

భారత ఆర్మీ.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని చైనా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ దీటుగా బదులిచ్చారు.

చైనాకు రక్షణ మంత్రి జైట్లీ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత ఆర్మీ.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని చైనా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ దీటుగా బదులిచ్చారు. ప్రస్తుత భారత్‌ 1962 నాటి భారత్‌కు భిన్నమైందని హెచ్చరించారు. సిక్కిం సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతను సృష్టించింది చైనానే అని మండిపడ్డారు.

1962 నాటి యుద్ధాన్ని ఉద్దేశించి చైనా చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో మాట్లాడారు. ‘1962 నాటి పరిస్థితి భిన్నమైంది. 2017 నాటి భారత్‌ భిన్నమైంది’ అని అన్నారు. భారత్‌ సరిహద్దులో ఉన్న వివాదాస్పద ప్రాంతం తమదేనని భూటాన్‌ స్పష్టం చేసిందని, దీని భద్రతపై భారత్, భూటాన్‌ల మధ్య ఒప్పందం ఉందని ఆయన వెల్లడించారు.

బలగాలు వెనక్కి తీసుకుంటేనే చర్చలు: చైనా
బీజింగ్‌: డోక్లాం నుంచి తమ సేనలను వెనక్కి తీసుకొంటేనే భారత్‌తో అర్థవంతమైన చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. డోక్లాంపై చైనాకు వివాదరహిత సౌర్వభౌమాధికారం ఉందని పేర్కొంది. జూన్‌ 18న భారత బలగాలు సరిహద్దు దాటి తమ దేశంలోని డోంగ్లాంగ్‌ ప్రాంతంలోకి చొరబడ్డాయని పేర్కొంది.

మానస సరోవర యాత్ర రద్దు
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సిక్కిం నాథులా మార్గం ద్వారా ఏటా సాగే కైలాస మానస సరోవర యాత్రను రద్దు చేసినట్టు కేంద్రం శుక్రవారం తెలిపింది. వివాదాస్పద చైనా–భారత్‌ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. దీంతో 400 మంది మానస సరోవర యాత్రికులు నిరాశకు గురయ్యారు. అయితే ఉత్తరాఖండ్‌లోని లిపులేక్‌ నుంచి వెళ్లే యాత్ర షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగనుంది.

ముందుగా నిర్ణయించిన ప్రకారం 50 మంది యాత్రికుల చొప్పున మొత్తం 8 బృందాలు నాథులా గుండా టిబెట్‌లోని మానససరోవరానికి వెళ్లాల్సి ఉంది. చైనా సరిహద్దు దాటి నాథులా ద్వారా బృందాలవారీగా సాగే ఈ యాత్ర జూన్‌ 20న మొదలై జూలై 31తో ముగియాలి. తొలి రెండు బ్యాచ్‌లకు వీసాలు మంజూరు చేసిన చైనా... ఉద్రిక్తతల నేపథ్యంలో మిగిలిన యాత్రికుల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టింది.  15,160 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస మానస సరోవర యాత్ర రెండు మార్గాల ద్వారా ఏటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాగుతుంది. హిందువులు, బౌద్ధులు, జైనులకు ఇది అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం.

రోడ్డు నిర్మాణంతో చిక్కులు: భారత్‌
సిక్కిం సమీపంలోని వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో చైనా నిర్మించ తలపెట్టిన రోడ్డుపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు యథాతథ స్థితి (స్టేటస్‌ కో)పై గణనీయమైన ప్రభావం చూపుతాయని, తమకు భద్రతాపరమైన చిక్కులు తలెత్తుతాయని చైనాకు స్పష్టం చేసింది. సిక్కిం సెక్టార్‌ నుంచి భారత దళాలను వెనక్కి తీసుకోవాలని చైనా డిమాండ్‌ చేసిన నేపథ్యంలో విదేశీ వ్యవమారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పందించింది. చైనా–భూటాన్‌ వివాదంలో భారత్‌ జోక్యం చేసుకుంటుందని బీజింగ్‌ ఆరోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement