సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఆ దేశ బలగాలు సోమవారం కూడా కాల్పులు విరమణ ఒప్పందానికి గండికొట్టాయి. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జమ్మూకాశ్మీర్‌లోని హమీర్‌పూర్ బెటాలియన్‌పైన , మంథార్‌లో కాల్పులకు తెగబడింది. ఈ దాడులను భారత బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి.
పూంచ్: సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఆ దేశ బలగాలు సోమవారం కూడా కాల్పులు విరమణ ఒప్పందానికి గండికొట్టాయి. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జమ్మూకాశ్మీర్‌లోని హమీర్‌పూర్ బెటాలియన్‌పైన , మంథార్‌లో కాల్పులకు తెగబడింది. ఈ దాడులను భారత బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. ఇరువైపుల ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. మెంధార్ సబ్‌సెక్టార్‌లో పాక్ సైన్యం మధ్యాహ్నం నుంచే దాడులు మొదలెట్టింది. చిన్నపాటి, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపింది. పాక్ దాడులను భారత జవాన్లు గట్టిగా తిప్పికొట్టారు. ఇరుపక్షాల మధ్య రాత్రి పొద్దుపోయేంతవరకు కాల్పులు జరిగాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. కాగా, పాక్ బలగాలు ఆదివారం రాత్రి పూంచ్ జిల్లా మాన్‌కోట్, మెంధార్‌లలో జనావాస ప్రాంతాల్లో భారీస్థాయిలో కాల్పులకు తెగబడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మన్మోహన్‌తో ఆర్మీ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ బిక్రమ్ సింగ్ సోమవారమిక్కడ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఆయన నివాసంలో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. పాక్ కాల్పులు, మన జవాన్ల ప్రతిదాడుల గురించి వివరించారు. బిక్రమ్‌సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతోనూ సమావేశమై పాక్ ఆర్మీకి ఎలా గట్టి జవాబివ్వాలో చర్చలు జరుపుతున్నారు.