మోదీజీ.. పకోడా బిజినెస్‌కు లోన్‌ ఇవ్వండి | Amethi youth writes to Smriti Irani: Help me start pakoda business | Sakshi
Sakshi News home page

మోదీజీ.. పకోడా బిజినెస్‌కు లోన్‌ ఇవ్వండి

Feb 14 2018 4:08 PM | Updated on Feb 14 2018 4:25 PM

Amethi youth writes to Smriti Irani: Help me start pakoda business - Sakshi

సాక్షి, లక్నో : పకోడా వ్యాపారం చేసుకునేందుకు తనకు సహకరించాలని అమేథికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు అశ్విన్‌ మిశ్రా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. తాను పకోడా బిజినెస్‌ను చేపట్టేందుకు ముద్రా రుణం మంజూరయ్యేలా తన తరపున ప్రధానిని కోరాలని ఆ యువకుడు కోరారు. పకోడా యూనిట్‌ ఏర్పాటు గురించి ప్రధాని ఓ న్యూస్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో చెప్పినప్పటి నుంచి తాను ఉద్యోగ ప్రయత్నాలు విరమించానని పకోడా జాయింట్‌ ప్రారంభించాలని నిర్ణయించకున్నానని అశ్విన్‌ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. పకోడీలు అమ్ముకోవడంపై ప్రధాని సూచన తనను అమితంగా ఆకట్టుకుందని.. ఇది తాను బతకడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడుతుందని భావించానన్నారు.

అయితే పకోడీ వ్యాపారాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించగా నిధుల కొరతతో ముందుకెళ్లలేకపోయానన్నారు. దీంతో లోన్‌ కోసం బ్యాంకులను ఆశ్రయించగా...తనకు రుణం లభించలేదన్నారు. ముద్రా యోజన ద్వారా పది కోట్ల మంది లబ్ధిపొందారని ప్రధాని చెబుతున్నా తనకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయని అమేథి బీజేపీ సోషల్‌ మీడియా మాజీ చీఫ్‌గా వ్యవహరించిన అశ్విన్‌ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మాటలు అవాస్తవాలని తాను భావించడంలేదని, బ్యాంకుల తీరుతోనే తాను ఈ లేఖ రాస్తున్నానని తన తరపున ప్రధానికి విజ్ఞప్తి చేసి పకోడా వ్యాపారం ప్రారంభించేలా తనకు రుణం మంజూరయ్యేలా చూడాలని మంత్రిని కోరారు.

మరోవైపు ఈ లేఖ బీజేపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేందుకు విపక్షానికి అవకాశం ఇచ్చినట్టైంది. బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయని.. ఇది కేవలం వాటికి ఓ ఉదాహరణేనని స్ధానిక కాంగ్రెస్‌ నేత అచ్ఛే లాల్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement