విమానం ఎక్కాలా.. వేలిముద్ర చాలు! | all you need is a fingerprint to board domestic flights soon | Sakshi
Sakshi News home page

విమానం ఎక్కాలా.. వేలిముద్ర చాలు!

Dec 17 2016 8:56 AM | Updated on Sep 13 2018 3:15 PM

విమానాశ్రయంలోకి వెళ్లడానికి మీ వ్యక్తిగత గుర్తింపు కార్డు, ఇతర పత్రాలు తీసుకెళ్తున్నారు కదూ.. కానీ ఇక మీదట అవన్నీ అక్కర్లేదు.. కేవలం మీ వేలిముద్ర చాలట!

విమానాశ్రయంలోకి వెళ్లడానికి మీ వ్యక్తిగత గుర్తింపు కార్డు, ఇతర పత్రాలు తీసుకెళ్తున్నారు కదూ.. కానీ ఇక మీదట అవన్నీ అక్కర్లేదు.. కేవలం మీ వేలిముద్ర చాలట! కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లే అంతా జరిగితే, ఇక రెండో దశలో స్వదేశీ విమానం ఎక్కడానికి కూడా వేలిముద్ర చూపిస్తే సరిపోతుందని అంటున్నారు. చూడటానికి ఇదంతా ఏదో వింతలా అనిపించొచ్చు గానీ.. పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇప్పటికే ఈ దిశగా కసరత్తులు మొదలుపెట్టేసింది. అందులోనూ హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే టెర్మినల్ వద్దకు వెళ్లడానికి బయోమెట్రిక్ గుర్తింపు పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలుచేస్తున్నారు. 
 
ఇప్పటి వరకు దేశంలో 100 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయని, ఆ కార్డులు ఇచ్చేటపుడు అన్ని వేళ్ల ముద్రలు, ఐరిస్ స్కాన్ చేసి వాటిని జాతీయ డిజిటల్ రిజిస్ట్రీలో ఫీడ్ చేశారని పౌర విమానయాన మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం విమానాశ్రయంలో టెర్మినల్ వద్దకు వెళ్లాలంటే తమ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు కూడా చూపించాలని, కానీ ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆధార్ నంబర్లు అడుగుతున్నామని చెప్పారు. విమానాశ్రయంలో వేలి ముద్ర వేస్తే ఆధార్ వివరాలు తెలుస్తాయని, టికెట్ మీద ఉన్నది.. అది రెండూ మ్యాచ్ అయితే టెర్మినల్ వద్దకు వెళ్లడం, స్వదేశీ విమానాలు ఎక్కడానికి కూడా అనుమతించొచ్చని ఆయన వివరించారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) పర్యవేక్షణలో హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మొహాపాత్ర చెప్పారు. త్వరలోనే ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో కూడా అమలు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement