పాక్‌ మీదుగా రయ్‌రయ్‌

Air Service Started Between India Pakistan  - Sakshi

అందుబాటులోకి పాక్‌ గగనతలం 

అన్ని పౌర విమానాలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ 

అన్ని రకాల ఆంక్షలు ఎత్తేసిన భారత్‌ 

న్యూఢిల్లీ: ఎట్టకేలకు పాకిస్తాన్‌ గగనతలాన్ని అందుబాటులోకి తెచ్చింది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య విమానయాన సేవలను మంగళవారం పునరుద్ధరించింది. బాలాకోట్‌ దాడుల అనంతరం దాదాపు నాలుగున్నర నెలల తర్వాత అన్ని పౌర విమానాలను తమ భూభాగంలోకి అనుమతించింది. ఈ మేరకు పాకిస్తాన్‌ విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విమానయాన సేవలను పునరుద్ధరించనున్నట్లు భారత్‌ పేర్కొంది. ఇరు దేశాల గగనతలాలపై విమానాలు తిరిగేందుకు ఎలాంటి ఆంక్షల్లేవని భారత పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు చాలా మేలు కలుగుతుందని పేర్కొంది.

పాకిస్తాన్‌ గగనతలాన్ని మూసేయడంతో విమానాలను దారి మళ్లించడం ద్వారా రూ.491 కోట్ల నష్టాలను చవిచూసిన ఎయిరిండియా విమాన సంస్థకు కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్‌కు ఉన్న 11 గగనతలాల్లో కేవలం రెండింటినే అందుబాటులో ఉంచింది. అయితే తన గగనతలంపై విధించిన తాత్కాలిక ఆంక్షలను భారత్‌ ఎత్తేసింది. దీనివల్ల వాణిజ్య విమానయాన సంస్థలకు పెద్దగా లాభం చేకూరలేదు. పాకిస్తాన్‌ గగనతలాన్ని మూసేయడంతో జూలై 2 వరకు స్పైస్‌జెట్‌ రూ.30.73 కోట్లు, ఇండిగో 25.1 కోట్లు, గోఎయిర్‌ రూ.2.1 కోట్లు నష్టపోయినట్లు జూలై 3న రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top