వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్-పాక్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానంటూ పాడినపాటే పాడారు. అలాగే భారత్-పాకిస్తాన్ వివాదంలో ఏడు విమానాలు కూలిపోయాయనే నిరాధార వాదనను మళ్లీ వినిపించారు. అయితే ఈసారి విమానాల సంఖ్యను పెంచడం విశేషం. ఆ రెండు అణ్వాయుధ దేశాలతో తాము వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని బెదిరించిన తర్వాతనే అవి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయని ట్రంప్ అన్నారు.
మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడిన ట్రంప్ తాను.. భారత్- పాక్ మధ్య శాంతి నెలకొనేందుకు మధ్యవర్తిత్వం వహించానని మరోమారు అన్నారు. ‘నాడు నేను భారత్- పాకిస్తాన్‌లతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నాను. ఇంతలో ఒక వార్తాపత్రిక మొదటి పేజీలో.. వారు యుద్ధానికి దిగుతున్నారని చదివాను. ఏడు విమానాలు తగలబడ్డాయి. ఎనిమిదవది చాలావరకూ ధ్వంసం అయ్యింది. మొత్తం ఎనిమిది విమానాలు కాలిపోయాయి..’ అవి రెండూ అణ్వాయుధ దేశాలు. ‘మీరు శాంతికి అంగీకరిస్తే తప్ప నేను మీతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోను’ అని నేను వారికి చెప్పాను’ అని ట్రంప్ అన్నారు.
అయితే ఢిల్లీ- ఇస్లామాబాద్‌లు యుద్ధం ముప్పును వ్యతిరేకించాయి. ఈ ఘర్షణకు వాణిజ్య ఒప్పందాలతో సంబంధం లేదని తెలిపాయని ట్రంప్ పేర్కొన్నారు. వెంటనే తాను స్పందిస్తూ ‘మీరు అణ్వాయుధ శక్తులు. నేను మీతో వ్యాపారం చేయడం లేదు. మీరు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు మేము మీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం లేదు’ అని స్పష్టం చేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ మర్నాడే ఆ రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయని తనకు ఫోన్ వచ్చిందని ట్రంప్ తెలిపారు. దీంతో తాను వారితో ‘ధన్యవాదాలు.. వాణిజ్యం చేద్దాం’ అని చెప్పానన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనను భారత్ తిరస్కరించింది. పాకిస్తాన్ కమాండర్లు ఈ దాడిని ఆపాలంటూ భారత సైన్యాన్ని వేడుకున్న దరిమిలా, మే 10న కాల్పుల విరమణ జరిగిందని భారత్ స్పష్టం చేసింది. అయితే ట్రంప్.. అమెరికా మధ్యవర్తిత్వ చర్చల తర్వాతనే భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇప్పటివరకూ 60 సార్లు చెప్పారని చేశారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరులను దారుణంగా హతమార్చిన దరిమిలా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.
ఇది కూడా చదవండి: ‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ


