పెళ్లి వేదికగా మారిన జయలలిత సమాధి

AIADMK Leader Decks Up Jayalalitha Samadhi As Wedding Venue for His Son - Sakshi

చెన్నై: తమిళ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు ప్రత్యేక స్థానం ఉంది. జనాకర్షక పథకాలతో ప్రజల్లో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు జయలలిత. తమిళ రాజకీయాల్లో జనాల చేత ‘అమ్మ’ అని పిలిపించుకున్న వ్యక్తి జయలలిత మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మరణించి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరచిపోలేదు. ఈ క్రమంలో జయలలిత అభిమాని, ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు ఒకరు అమ్మ సమాధి వేదికగా తన కుమారుడి వివాహం జరిపించాడు.

ఆ వివరాలు.. ఏఐడీఏంకే నాయకుడు ఎస్‌ భవానీశంకర్‌ తన కుమారుడు సాంబశివరామన్‌ వివాహాన్ని అమ్మ సమాధి దగ్గర జరిపించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన కుమారుడికి అమ్మ ఆశీస్సులు అందాలనే ఉద్దేశంతోనే పెళ్లి ఏర్పాట్లు ఇక్కడ చేశానని తెలిపాడు భవానీశంకర్‌. అయితే అమ్మ సమాధి వద్ద వివాహం జరపించడానికి అధికారుల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకకు పలువురు పార్టీ ప్రముఖులతో పాటు కార్యకర్తలు కూడా హాజరయ్యారు. వివాహం సందర్భంగా అమ్మ సమాధిని అందంగా అలంకరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top