మేం కట్టం..

Against the tax imposed on salt - Sakshi

పాలకుల ఆజ్ఞల్ని శిరసావహించేవారు కొందరైతే, వాటిని పూచికపుల్లగా ధిక్కరించి విప్లవాగ్ని రగిల్చినవారు మరికొందరు. చరిత్ర పుటల్లో కొందరు ఇలాంటి ధిక్కారాలకు  పాల్పడి పాలకుల పాలిట సింహస్వప్నమై నిలిచారు. పన్ను పోట్లపై దండెత్తారు. ‘దండి’గా ధిక్కరణ

►తెల్లవాడి దురహంకారంపై తొలి దెబ్బ. రవి అస్తమించని సామ్రాజ్యం మాది.. అంటూ విర్రవీగుతున్న ఆంగ్లేయుల నెత్తిపై తొలి పిడుగు.. అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా 1930 మార్చి 12న జాతిపిత బాపూజీ నేతృత్వంలో సాగిన ఈ సత్యాగ్రహం ఏప్రిల్‌ 6న గుజరాత్‌లోని దండిలో బ్రిటిష్‌ చట్టాలను ధిక్కరించి ఉప్పును తయారుచేయడంతో ముగిసింది.

ఉక్కు మహిళకూ తప్పలేదు..
►స్థానిక, సేవల పన్నులకు వ్యతిరేకంగా 1990లో బ్రిటన్‌ పౌరులు సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. 2కోట్ల మంది ఈ పన్నులను చెల్లించేందుకు నిరాకరించారు. ట్రఫాల్గర్‌ స్క్వేర్‌ వద్దకు లక్షలాదిగా చేరుకుని సర్కారుపై యుద్ధభేరి మోగించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గొడవలు, అల్లర్లు చెలరేగాయి. చివరికి నాటి ప్రధాని, ఉక్కు మహిళ మార్గరేట్‌ థాచర్‌ ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు.

టీ కప్పులో ‘బోస్టన్‌’తుపాను.. 
►ఆంగ్లేయుల గుత్తాధిపత్యానికి ‘బోస్టన్‌ టీ పార్టీ’ఉదంతం చెంపపెట్టులాంటిది. బ్రిటన్‌ ప్రభుత్వానికి చెందిన ఈస్టిండియా కంపెనీకి, వారి తొత్తులకు మాత్రమే టీ పొడి దిగుమతిపై పన్నును మినహాయించడం వలస పాలనలో మగ్గుతున్న అమెరికా వర్తకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో బోస్టన్‌ వర్తకులు తిరుగుబాటు చేసి అక్కడి నౌకల్లోని టీ పొడి మొత్తాన్ని సముద్రంపాలు చేశారు. 1773 డిసెంబర్‌లో జరిగిన ఈ సంఘటన చరిత్రలో బోస్టన్‌ టీ పార్టీగా వినుతికెక్కింది.   

ప్రజలకోసం నగ్నంగా.. 
►పన్నుల పేరిట భర్త అరాచకాన్ని చూడలేక భార్యే ఎదురుతిరిగిన సంఘటన ఇది. 11వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లోని మెర్సియా రాజ్యపాలకుడు లియోఫ్రిక్‌ ప్రజలపై విపరీతంగా పన్నులు వేసి వేధించేవాడు. సామాన్యుల కష్టాలకు చలించిపోయిన అతడి భార్య లేడీ గొడవపడి భర్తతో వాగ్వాదానికి దిగింది. రెచ్చిపోయిన భర్త.. నగ్నంగా శ్వేతాశ్వంపై నగరాన్ని చుట్టొస్తే పన్నుల భారం తగ్గిస్తానన్నాడు. ఆమె ఒప్పుకుంది. గుర్రంపై నగ్నంగా వెళుతున్నప్పుడు ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దన్న షరతుతో నగ్నంగా నగర వీధుల్లో దౌడులు తీసింది. 

బడ్జెట్‌.. ‘బొగెట్టీ’
►బడ్జెట్‌ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలుసంచిలో తీసుకొచ్చేవారు. అందువల్లే ఈ మాట వాడుకలోకి వచ్చింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top