పద్నాలుగేళ్ల కిందట కార్గిల్‌లోకి చొరబడి భారత జవాన్ల చేతిలో మట్టికరచిన పాక్ సైన్యం తాజాగా మళ్లీ అక్కడ కవ్వింపునకు దిగింది.
1999 నాటి యుద్ధం తర్వాత తొలిసారి..
న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల కిందట కార్గిల్‌లోకి చొరబడి భారత జవాన్ల చేతిలో మట్టికరచిన పాక్ సైన్యం తాజాగా మళ్లీ అక్కడ కవ్వింపునకు దిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంత మైన కార్గిల్ సెక్టార్‌లో నాలుగు రోజుల్లో రెండుసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాక్ 14 ఏళ్లలో కార్గిల్‌లో కాల్పులకు పాల్పడడం ఇదే తొలిసారి. సోమవారం రాత్రి ద్రాస్, కార్గిల్‌ల మధ్యలోని కక్సార్‌లో ఉన్న చెనిగుండ్ పోస్టుపై పాక్ బలగాలు తొలుత చిన్నపాటి ఆయుధాలతో, తర్వాత ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపాయి. గురువారం రాత్రి లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌లో సాందో పోస్టుపై ఇదే దుశ్చర్యకు ఒడిగట్టాయి. పాక్ కాల్పులకు భారత జవాన్లు దీటైన ఎదురుకాల్పులతో గట్టి జవాబిచ్చారు.
1999లో పాక్ సైనికులు కార్గిల్‌లోకి చొరబడడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కార్గిల్ జోలికి రావడానికి భయపడిన పాక్ బలగాలు ప్రస్తుతం సరిహద్దులో కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ మళ్లీ కార్గిల్‌లో కాల్పులు జరిపాయి.1999 నాటి యుద్ధంలో భారత యువ లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా, ఆయన సహచరులు చెనిగుండ్ పోస్టు వద్దే కనిపించకుండా పోయారు. తర్వాత చిత్రహింసలతో ఛిద్రమైన వారి మృతదేహాలను పాక్ భారత్‌కు అప్పగించింది. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో భారత హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి జమ్మూలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు.